TS Election Code: ఒక్కరోజే రూ. 78 కోట్లు.. మొత్తం రూ.243 కోట్ల సొత్తు స్వాధీనం
X
వందల రూ.కోట్లు, వజ్రాలు, బంగారం, వెండి, మద్యం.. ఇతరత్రా వస్తువులన్నింటిని సీజ్ చేసుకుంటున్న పోలీసు, ఈసీ అధికారులే విస్తుపోతున్న పరిస్థితి ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తోంది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇప్పటివరకు ఎలాంటి పత్రాలు లేకుండా తరలిస్తున్న రూ.243 కోట్లకు పైగా విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు పోలీసులు . గురువారం ఉదయం నాటికే పోలీసులు పలు జిల్లాల్లో స్వాధీనం చేసుకున్న సొత్తు విలువ రూ. 243కోట్లకు చేరింది. ఇక నామినేషన్ల ఘట్టం, ప్రచారం, ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు ఇంకా ఎంత మొత్తం స్వాధీనం చేసుకుంటారో చూద్దామని కేంద్ర ఎన్నికల సంఘమే తెలంగాణపై ఉత్సుకతతో ఎదురుచూస్తున్న పరిస్థితి నెలకొంది.
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు విస్తృత తనిఖీలు చేపడుతున్నారు. అక్రమంగా నగదు, మద్యం తరలించకుండా పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా అంతర్రాష్ట సరిహద్దుల్లో 148 చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణలోకి వచ్చే వాహనాలతో పాటు, రాష్ట్రంలోను విస్తృతంగా తనిఖీ చేస్తున్నారు. పెద్దఎత్తున డబ్బు, బంగారం, వస్తువులు, మద్యం స్వాధీనం చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే బుధవారం ఉదయం 9 నుంచి గురువారం ఉదయం 9 గంటల వరకూ (24 గంటల్లో) రూ.78,03,27,446 విలువైన సొత్తు పట్టుకున్నారు. ఇందులో రూ.10,13,01,956 నగదు, రూ.57,67,52,328 విలువైన బంగారం, వెండి, వజ్రాలు ఉన్నాయి.
తనిఖీల్లో రూ.120.40కోట్ల విలువైన బంగారం, వెండి వస్తువులను పట్టుకున్నారు. 24గంటల్లో 83 కిలోల బంగారం 213 కిలోల వెండి, 113 క్యారెట్ల వజ్రాలు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ పరిధిలోని చైతన్యపురిలో ఓ వ్యక్తి నుంచి రూ.97లక్షలను పోలీసులు గుర్తించి.. పట్టుకున్నారు. సదరు వ్యక్తిని రాజేశ్‌గా గుర్తించారు. నల్గొండ జిల్లా చిట్యాల వద్ద జాతీయ రహదారిపై పోలీసులు వాహన తనిఖీల్లో భాగంగా భారీగా బంగారం, వెండి ఆభరణాలు పట్టుకున్నారు. వీటి విలువ రూ.26 కోట్లు ఉంటుందని చిట్యాల ఎస్సై ఇ.రవి తెలిపారు.