MLC Kavitha : లిక్కర్ స్కాం కేసులో కీలక మలుపు.. నిందితురాలిగా కవిత..
X
(MLC Kavitha) ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కుంభకోణంపై దర్యాప్తు జరుపుతున్న సీబీఐ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను నిందితురాలిగా చేర్చింది. ఈ మేరకు విచారణకు హాజరుకావాలంటూ అధికారులు ఆమెకు సీఆర్పీసీ 41 ఏ నోటీసులు జారీ చేశారు. ఫిబ్రవరి 26న ఢిల్లీలోని సీబీఐ ఆఫీసుకు రావాలని అందులో స్పష్టం చేశారు.
లిక్కర్ స్కాం కేసుకు సంబంధించి సీబీఐ 2022 డిసెంబర్ లో తొలిసారి కవితను ప్రశ్నించింది. అప్పట్లో కేసులో సాక్షిగా కవితను ఆమె నివాసంలోనే ప్రశ్నించింది. ఆ తర్వాత మరో రెండుసార్లు సీబీఐ అధికారులు ఆమెను ప్రశ్నించారు. ఇటీవలే కేసు పురోగతికి సంబంధించి సీల్డ్ కవర్ నివేదికను ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టుకు సమర్పించిన సీబీఐ అందులో అనేక అంశాలను పొందుపరిచింది. ఈ క్రమంలోనే సీబీఐ కవితను నిందితురాలిగా పేర్కొంటూ 41 - ఏ నోటీసులు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది.
మద్యం కుంభకోణంలో సీబీఐ దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన అంశాల ఆధారంగా అభిషేక్ బోయినపల్లిని అరెస్ట్ చేసిన సమయంలో కవిత పేరు తెరపైకి వచ్చింది. దీంతో ఏడాదికిపైగా ఆయన జైలులోనే ఉన్నారు. మరోవైపు ఢిల్లీకి చెందిన లిక్కర్ వ్యాపారి సమీర్ మహేంద్రుపై దాఖలు చేసిన ఛార్జిషీట్లోనూ అధికారులు కవిత పేరు ప్రస్తావించారు.
ఇదిలా ఉంటే లిక్కర్ స్కాంలో మనీ లాండరింగ్ కు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సైతం కవితకు నోటీసులు ఇచ్చింది. అయితే ఆ నోటీసులపై ఆమె గతేడాది సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈడీ అధికారులు తనకు ఇచ్చిన నోటీసులను రద్దుచేయడంతో పాటు మహిళలను ఇంటి వద్దే విచారణ జరపాలని, తనను అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ఫిబ్రవరి 28న సుప్రీంకోర్టులో విచారణకు రానుంది.