Home > తెలంగాణ > మెహదీపట్నం స్కైవాక్ నిర్మాణానికి తొలగిన అడ్డంకులు

మెహదీపట్నం స్కైవాక్ నిర్మాణానికి తొలగిన అడ్డంకులు

మెహదీపట్నం స్కైవాక్ నిర్మాణానికి తొలగిన అడ్డంకులు
X

మెహదీపట్నంలో స్కై వాక్‌ నిర్మాణం కోసం భూమి కేటాయించేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. స్కై వాక్‌ నిర్మాణం కోసం డిఫెన్స్కు చెందిన 3,380 చదరపు గజాల స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించేందుకు ఓకే చెప్పింది. ఆ భూమికి బదులుగా రక్షణ శాఖకు రూ.15.15 కోట్ల మేర మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పింది. కొంత స్థలానికి 10 ఏండ్ల పాటు లైసెన్స్‌ ఫీజు చెల్లించాలని కేంద్రం షరతు విధించింది. భూబదలాయింపు ప్రక్రియ నాలుగు వారాల్లో పూర్తి చేస్తామని రక్షణ శాఖ ప్రకటించింది.

డిఫెన్స్ ల్యాండ్ అప్పగించడంతో త్వరలోనే మెహదీపట్నం రైతు బజార్ వద్ద స్కైవాక్ నిర్మాణం చేపట్టనున్నట్లు హెచ్ఎండీఏ వెల్లడించింది. వాస్తవానికి రక్షణ శాఖ భూముల బదిలీ వ్యవహారం కొలిక్కి రాకపోవడంతో స్కైవాక్ నిర్మాణ పనులు చాలాకాలంగా పెండింగ్లో ఉన్నాయి. ఈనెల 5న ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి రక్షణ శాఖ మంత్రిని కలిసి డిఫెన్స్ ల్యాండ్ అంశంపై చర్చించారు. ఈ సందర్భంగా స్కైవాక్ నిర్మాణం విషయంలో కేంద్ర ప్రభుత్వం పలు సూచనలు చేసింది. అందుకు అనుగుణంగా మార్పులు చేసి సవరించిన ప్రతిపాదనలు కేంద్రానికి పంపారు. తాజాగా భూకేటాయింపునకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో మెహదీపట్నం స్కైవే నిర్మాణానికి సంబంధించి పనులు వేగవంతం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

Updated : 24 Jan 2024 2:37 PM GMT
Tags:    
Next Story
Share it
Top