సామాన్యుడిపై కేంద్రం మరో పెనుభారం.. విద్యుత్‌పై జీఎస్టీ?
X
కేంద్రప్రభుత్వం సామాన్యుడిపై మరో పెనుభారాన్ని వేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ప్రజల నిత్యవసర వస్తువుల్లో విద్యుత్ కూడా చేరడంతో.. విద్యుత్ వినియోగదారులపై జీఎస్టీ విధించేందుకు విధివిధానాలను రూపొందిస్తోంది. ఇందుకోసం ‘డెలాయిట్ ఆడిట్ అండ్ కన్సల్టెంట్స్’ అనే ప్రైవేట్ సంస్థను ఆశ్రయించింది. విద్యుత్ వినియోగదారులపై జీఎస్టీ విధిస్తే వచ్చే లాభనష్టాలెంటో రిపోర్ట్ ఇవ్వాలంటూ కొన్ని రోజుల క్రితం... కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ సదరు సంస్థను కోరింది. కేంద్రం ఆదేశాలతో పలు రాష్ట్రాల్లో అధ్యయనం చేసిన ‘డెలాయిట్’.. ఇటీవలే తన నివేదికను కేంద్రానికి సమర్పించింది. కరెంటును జీఎస్టీ పరిధిలోకి తెస్తే.. ప్రభుత్వ ఆదాయం పెరుగుతుందనీ, ప్రజల నుంచి ఆశించిన స్థాయిలో వ్యతిరేకత ఉండకపోవచ్చని ఆ రిపోర్ట్‌లో తెలిపింది. ఇంకేముంది.. ఆశించినట్లే రిపోర్ట్ రావడంతో మోదీ ప్రభుత్వం.. విద్యుత్ వినియోగదారులపై మరో రెండ్రోజుల్లో కరెంట్ బాంబు వేయడానికి ప్రణాళికలు చేస్తోంది.
ఆదాయం కోసమే అధ్యయనం
ఇప్పటివరకూ దేశంలోని పలు రాష్ట్రాల్లో కరెంట్ బిల్లులతో కలిపి ఎలక్ట్రిసిటీ డ్యూటీ (ఈడీ) వసూలు చేస్తున్నారు. ఇది ఒక్కో రాష్ట్రానికి ఒక్కో రకంగా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఎలక్ట్రిసిటీ డ్యూటీ (ED)ని యూనిట్‌కు 6 పైసలు చొప్పున వసూలు చేస్తున్నారు. ఉదాహరణకు 100 యూనిట్ల కరెంటు కాలితే, ఎలక్ట్రిసిటీ డ్యూటీ రూ.6 చెల్లించాల్సి ఉంటుంది. కరెంటు బిల్లులో ఎలక్ట్రిసిటీ డ్యూటీ కాలమ్ సపరేట్‌గా ఉంటుంది. బిల్లు మొత్తంలో ఈ సొమ్ము కలిసే ఉంటుంది. స్వల్ప మొత్తమే కాబట్టి వినియోగదారులు దీనిపై పెద్దగా దృష్టిపెట్టలేదు. ఇప్పుడు కేంద్రం చూపు దీనిపై పడింది. అందుకోసమే డెలాయిట్ సంస్థతో దీనిపై అధ్యయనం చేయించగా... ఈ ‘ED’ ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకంగా ఉందని, దీని వల్ల పన్ను వసూళ్లలో హేతుబద్ధత లేకుండా పోతున్నదనీ, దాన్ని క్రమబద్దీకరిస్తూ ‘జీఎస్టీ’ పరిధిలోకి తెస్తే, రాష్ట్రాల వాటా ఆదాయం కూడా పెరుగుతుందని ‘డెలాయిట్’ తన నివేదికలో తెలిపినట్లు సమాచారం.
అంతిమంగా సామాన్యుడిపైనే భారం
కరెంటు వినియోగదారుల్ని GST పరిధిలోకి తెస్తే దాని ప్రభావం ఆయా రాష్ట్రాల ఆదాయంపైనేగాక పరిశ్రమలు, గృహ వినియోగదారులపై భారీగా పడుతుందని చెప్పింది. పరిశ్రమలకు కరెంటు జీఎస్టీ భారం అధికమైతే, వాటి ఉత్పత్తి వ్యయం పెరిగి, తద్వారా మార్కెట్‌లో వస్తువుల ధరలు భారీగా పెరిగే అవకాశముందని చెప్పింది. దీనివల్ల రాష్ట్రాలు కొంత ఆదాయాన్ని కోల్పోతాయని అయితే ఆ ఆదాయాలను భర్తీ చేసేలా జీఎస్టీ శ్లాబు రేటు నిర్ణయం జరగాలని కేంద్రానికి సూచించింది. అదే సమయంలో ఈ నిర్ణయంతో దేశీయ పారిశ్రామిక రంగం నుంచి వ్యతిరేకత రావొచ్చని తెలిపింది. రాష్ట్రాల మధ్య ‘ఈడీ’ పన్ను ఒక శాతం నుంచి 5 శాతం వరకు ఉన్నదనీ, జీఎస్టీ పరిధిలోకి తెస్తే 0.5 శాతం నుంచి ఒక్క శాతానికి పరిమితం చేయవచ్చని ప్రతిపాదించింది. మరోవైపు ప్రస్తుతం విద్యుత్‌పై జీఎస్టీ లేనందున ఉత్పత్తిదారులు ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్‌లను ఉపయోగించుకోలేకపోతున్నారనీ, విద్యుత్‌పై జీఎస్టీ రేటును 5 శాతంగా నిర్ణయిస్తే, బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్లు ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్‌ను క్లెయిమ్ చేసుకునే వెసులుబాటు లభిస్తుందని ‘డెలాయిట్’ విశ్లేషించింది. త్వరలోనే కేంద్రప్రభుత్వం దీన్ని అమల్లోకి తెచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
గతంలో కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్రాల విద్యుత్ ఉన్నతాధికారులతో జరిగిన సమావేశాల్లో ఈ విషయంపై చర్చించగా.. బీజేపీ పాలిత రాష్ట్రాలు మాత్రం స్వాగతించాయి. ప్రస్తుతం ఈ ప్రతిపాదనకు అన్ని రాష్ట్రాలను ఒప్పించేలా మోదీ సర్కార్ కసరత్తు చేస్తున్నది.