Chalamala Krishna Reddy: కాంగ్రెస్లో ముసలోళ్ల రాజ్యం నడుస్తుంది.. జోకిన వాడికే టికెట్: చలమల
X
తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల సెకండ్ లిస్ట్ ప్రకంపనలు సృష్టిస్తోంది. టికెట్ రాని నాయకుల్లో కొందరు పార్టీ మారుతు, కొందరు నిరసన వ్యక్తం చేస్తుంటే.. మరికొందరు రెబల్ గా మారుతున్నారు. ఈ క్రమంలో టికెట్ వస్తుందని ఆశపడ్డ నేతలకు టికెట్ దక్కకపోవడంతో తట్టుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో మునుగోడు టికెట్ ఆశించి భంగపడ్డ చలమల కృష్ణారెడ్డి తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. తనను కాదని మునుగోడు టికెట్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఇవ్వడంపై మండిపడుతున్నారు. కాగా ఇవాళ చౌటుప్పల్ లో తన అనుచరులతో భేటీ అయిన కృష్ణారెడ్డి.. భవిష్యత్తు కార్యాచరణ గురించి వారితో చర్చించారు.
మునుగోడు బరిలో తాను కచ్చితంగా ఉంటానని తేల్చి చెప్పారు. తాను అందరిలా బొక్కల కోసం ఎదురుచూసే వ్యక్తిని కాదని చెప్పుకొచ్చారు. మొదటి లిస్టులో ఉన్న పేరును.. సెకండ్ లిస్టులో లేకుండా చేశారని మండిపడ్డారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డిలు కుట్రపూరితంగా తన పేరును తొలగించారని అన్నారు. నల్గొండ జిల్లాకు వారు చేసిన అభివృద్ధి ఏంటని ప్రశ్నించారు. తమ కుటుంబాలు తప్ప ఏమీ అభివృద్ధి జరగలేదని ఆరోపించారు. వారి కుటుంబ సభ్యులకు టికెట్ కావాలి కానీ.. పార్టీ కోసం కష్టపడ్డ వారికి టికెట్ ఇవ్వరని ఆవేదన వ్యక్తం చేశారు.
మునుగోడులోనే కాదు మొత్తం నల్గొండ జిల్లాలో తన తడాఖా చూపిస్తానని చలమల ధీమా వ్యక్తం చేశారు. చలమల అంటే డబ్బుకు తలొంచే వ్యక్తి కాదని.. ప్రజలకే తలొంచే మనిషని చెప్పుకొచ్చారు. ఉత్తమ్, కోమటిరెడ్డిలు కలిసి రేవంత్ రెడ్డిని కూడా చాలా ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. తనకు ఉప ఎన్నికల్లో సీటు ఇవ్వకున్నా.. కాంగ్రెస్ పార్టీ కోసం క్షేత్ర స్థాయిలో అభివృద్ధి చేశానని చెప్పుకొచ్చారు. పైసల రాజకీయం చేసే రాజగోపాల్ రెడ్డికి.. రానున్న రోజుల్లో ప్రజలే బుద్ది చెప్తారని అన్నారు. సేవ్ మునుగోడు అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్తానని చలమల కృష్ణారెడ్డి చెప్పారు.