Chicken Prices:చికెన్ ధర రూ.320.. ఇంకా పెరిగే అవకాశం
చికెన్ ధర రూ.320.. ఇంకా పెరిగే అవకాశం
X
రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో చికెన్ ధరలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఎండల ధాటికి ఉష్ణతాపం పెరిగి కోళ్లు మృత్యువాత పడుతుండటంతో మాంసం ఉత్పత్తి తగ్గగా, డిమాండ్ పెరిగి ధరపై ప్రభావం చూపుతున్నాయి. నెల రోజుల క్రితం వరకు కిలో స్కిన్‌లెస్ రూ.230, స్కిన్ చికెన్ రూ.200 ధర పలకగా ప్రస్తుతం మార్కెట్‌లో కిలో బ్రాయిలర్ చికెన్ ధర రూ.320కు, స్కిన్‌తో రూ.300 పలుకుతోంది. మండుటెండలకు బ్రాయిలర్ కోళ్లు చనిపోవడం, తగినంత దాణా తీసుకోకపోవడం వంటి కారణాలతో చికెన్ ధరలకు రెక్కలు వస్తున్నాయి జనాలు కూడా కరోనా తర్వాత నాన్ వెజ్ వాడకాన్ని పెంచారు. ఇందులోనూ చికెన్ వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. వినియోగదారుల అవసరం మేర ఉత్పత్తి లేకపోవడం కూడా చికెన్ ధరలు కొండెక్కడానికి మరో కారణం. ధరలు చూసి కొనుగోలు చేసేందుకు వినియోగదారులు ముందుకు రావడంలేదు. ఈ పరిస్థితుల్లో వ్యాపారాలు మందగించినట్లు వ్యాపారులు చెబుతున్నారు.
ఎండల తీవ్రతకు మాంసం ఉత్పత్తి పడిపోవడంతో కిలో రూ.320 వరకు చేరిన చికెన్ ధర మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. ఎండల ప్రభావంతో కోడిగుడ్ల ఉత్పత్తి కూడా 20 శాతానికి తగ్గింది. సాధారణంగా ఉష్ణోగ్రత 40 సెల్సియస్ డిగ్రీల దాటితే కోళ్లు తట్టుకోలేవు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 42 నుంచి 45 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో కోళ్లను కాపాడుకునేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోతున్నదని లేదని రైతులు వాపోతున్నారు. నెల రోజులుగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో కోళ్ల ఉత్పత్తి గణనీయంగా తగ్గింది. పౌల్ట్రీ ఫారాల్లో పెంచుతున్న కోళ్లు వడగాలులకు తట్టుకోలేక మృత్యువాత పడుతున్నాయి.