నేడు సూర్యాపేటలో సీఎం కేసీఆర్ పర్యటన
X
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం సూర్యాపేటలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు కార్యాలయాలు, భవనాలను ప్రారంభించనున్నారు. ఉదయం 10.35 గంటలకు సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ నుంచి బయలుదేరి 10.40 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి ఉదయం 11.15 గంటలకు హెలికాప్టర్‌లో సూర్యాపేటలోని ఎస్వీ డిగ్రీ కళాశాల ఆవరణలోని హెలిప్యాడ్‌కు చేరుకుంటారు.
పట్టణంలో 500 కోట్లతో చేపడుతున్న మెడికల్ కళాశాలకు సంబంధించి రూ.156 కోట్లతో నిర్మించిన ప్రధాన భవనాలను ప్రారంభిస్తారు. అనంతరం రూ.30.18 కోట్లతో పాత వ్యవసాయ మార్కెట్‌లో నిర్మాణమైన ఇంటెగ్రేటెడ్ మోడల్ మార్కెట్‌ను ప్రారంభించి.. అక్కడి నుంచి నేరుగా రూ.38.50 కోట్లతో 20 ఎకరాల్లో నిర్మాణం పూర్తి చేసుకున్న జిల్లా పోలీసు కార్యాలయం వద్దకు చేరుకొని ప్రారంభిస్తారు. అనంతరం సమీపంలోనే నిర్మించిన బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించి జిల్లా కేంద్రంలో రూ.50 కోట్లతో 21 ఎకరాల్లో నిర్మించిన సమీకృత కలెక్టరేట్ భవన సముదాయం ప్రారంభోత్సవం చేస్తారు.
సాయంత్రం 3 గంటలకు బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో రెండు లక్షల మందితో ఏర్పాటు చేస్తున్న బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. సభ ఏర్పాట్లను ఇప్పటికే పార్టీ శ్రేణులు పూర్తి చేశాయి. భారీ వర్షం కురిసినా సీఎం పర్యటన, సభకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశారు. సీఎం కేసీఆర్ పర్యటనకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పకడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేసినట్లు డీఐజీ చౌహాన్ తెలిపారు. సాయంత్రం 4.50 గంటలకు సీఎం కేసీఆర్ హెలికాప్టర్ లో హైదరాబాద్ బయల్దేరనున్నారు. వాతావరణం అనుకూలించకపోతే రోడ్డు మార్గాన హైదరాబాద్ బయల్దేరి వెళ్లనున్నారు.