Revanth Reddy : 'కేసీఆర్ మాట్లాడిన భాషపై కూడా చర్చిద్దామా?': సీఎం రేవంత్ రెడ్డి
X
సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్షాలపై వాడుతున్న భాష అభ్యంతరకరంగా ఉందంటూ బీఆర్ఎస్ సభ్యులు చేస్తున్న కామెంట్స్ కు ముఖ్యమంత్రి గట్టి కౌంటర్ ఇచ్చారు. మాజీ సీఎం కేసీఆర్ వాడిన భాష మీద కూడా చర్చ చేద్దామా అంటూ ప్రశ్నించారు. నల్గొంగ సభలో మాజీ సీఎం కేసీఆర్ వాడిన భాష గురించి ప్రస్తావిస్తూ.. ఓ మాజీ సీఎం అయి ఉండి సీఎంని పట్టుకొని ఏం పీకినీకి పోయినవ్ అని అనొచ్చా? ఇది పద్ధతా? ఇదేనా తెలంగాణ సంప్రదాయం అంటూ నిలదీశారు. ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పినా.. బీఆర్ఎస్ బుద్ధి మారలేదన్నారు. . మొన్నటి ఎన్నికల్లో కేసీఆర్ ప్యాంట్ ఊడబీకారని.. ఇప్పుడు చొక్కా, అంగీ ఊడబీకితాం అంటూ ఘాటుగా రిప్లయ్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి.
"బొక్క బోర్లా పడ్డా బీఆర్ఎస్ సభ్యులకు బుద్ది మారలేదు. సభలో చర్చకు రమ్మంటే రాకుండా పారిపోయారు. కుంగిన మేడిగడ్డలో నీళ్లు నింపే పరిస్థితి ఉందా.? సాగునీటి పారుదల శాఖను చూసిన కేసీఆర్, హరీష్ రావుకు పెత్తనం ఇస్తాం.. మేడిగడ్డలో నీరు నింపి.. అన్నారం, సుందిళ్లకు ఎత్తిపోసే బాధ్యతను అప్పగిస్తాం. మేడిగడ్డ కుంగిపోయి కుప్పకూలుతుంటే నీరు నింపటం సాధ్యమవుతుందా? కాళేశ్వరం మొత్తం దెబ్బతిని రూ.94 వేల కోట్ల ప్రజాధనం వృథా అయింది. ప్రతిపక్ష నాయకుడు సభకు రాకుండా పారిపోయాడు.కేసీఆర్ వస్తే రేపు సాయంత్రం వరకైనా చర్చిద్దాం. కేసీఆర్ ను చంపాల్సిన అవసరం ఎవరికి ఉంది? చచ్చిన పామును ఎవరు చంపుతారు? కేసీఆర్ అనే పాము మొన్న ఎన్నికల్లోనే చచ్చిపోయింది" అని అన్నారు.