TSPSC ద్వారా త్వరలోనే ఉద్యోగాల భర్తీ.. సీఎం రేవంత్
X
టీఎస్‌పీఎస్సీ ద్వారా త్వరలో ఉద్యోగాల భర్తీ చేపడతామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కొత్తగా ఎంపికైన 7,094 మంది స్టాఫ్ నర్స్‌లకు నియామకపత్రాలు అందజేశారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న సీఎం మాట్లాడుతూ.. త్వరలో 15వేల పోలీసు ఉద్యోగాలు కూడా భర్తీ చేయనున్నట్టు చెప్పారు.
ఎంతో పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలని గత ప్రభుత్వం యోచన చేయలేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కుటుంబసభ్యుల ఉద్యోగాల గురించే ఆనాటి ప్రభుత్వ ఆలోచన చేసిందన్నారు. అసలు తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసేందుకు కారణమైన నిరుద్యోగ యువతీ యువకులకు.. పదేళ్ల బీఆరెస్ పాలనలో ఒరిగిందేం లేదన్నారు. తమ కుటుంబ సభ్యులకు పదవుల గురించి తప్ప.. వాళ్లు రాష్ట్రంలో నిరుద్యోగులకు న్యాయం చేయాలనే ఆలోచన చేయలేదని చెప్పారు.
కార్యక్రమానినకి హాజరైన స్టాఫ్ నర్స్‌లను, నిరుద్యోగులనుద్దేశించి మాట్లాడుతూ..." వాళ్ల ఉద్యోగాలు ఊడగొట్టగానే మీకు ఉద్యోగాలు వచ్చాయి..మేం ఉద్యోగాలు భర్తీ చేయడానికి ప్రయత్నిస్తుంటే... మా ప్రభుత్వంపై హరీష్ శాపనార్థాలు పెడుతుండు..హారీష్ రావు గారు... పిల్లి శాపనార్ధాలకు ఉట్టి తెగిపడదు. అవాకులు చెవాకులు పలకడం కాదు... ఒక్కసారి ఇక్కడున్న పేదోళ్ల బిడ్డల కళ్లలో ఆనందం చూడండి..కేసీఆర్ గారు.. మీరైనా పిలిచి మీ అల్లుడికి గడ్డి పెట్టండి..మా ప్రభుత్వం టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేసి కొత్త చైర్మన్, సభ్యులను నియమించింది.త్వరలోనే ఉద్యోగాల భర్తీ చేపడతాం..ఈ వేదిక నుంచి మీకు మాట ఇస్తున్నా...నిరుద్యోగులకు ఇచ్చిన మాటకు మేం కట్టుబడి ఉన్నాం..ఏడాదిలోగా 2లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తాం.. మీ కళ్ళల్లో ఆనందం చూసి..ఫామ్ హౌస్ లో ఉన్నోళ్లు కుల్లుకున్నా.. కడుపులో దుఃఖం పొంగుకొచ్చినా ఉద్యోగాల భర్తీ ఆగదు..’’ అని సీఎం తెలిపారు. కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, తుమ్మల నాగేశ్వరరావు లు పాల్గొన్నారు.