బైరి నరేష్, అయ్యప్ప స్వాముల మధ్య వాగ్వాదం. చివరికి..
X
ములుగు జిల్లా ఏటూరు నాగారంలో నాస్తికుడు బైరి నరేష్ వీరంగం సృష్టించాడు. ఏటూరు నాగారంలో భీంరావ్ కోరేగావ్ సమావేశానికి వెళ్లిన బైరి నరేష్... అక్కడ చోటుచేసుకున్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా.. తన కారుతో ఓ అయ్యప్ప భక్తుడిని నరేష్ ఢీ కొట్టినట్లు సమాచారం. ఈ ఘటనలో అయ్యప్ప స్వామి భక్తుడు పోగు నర్సింహరావుకు కాలు విరగ్గా.. పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. దీంతో అక్కడే ఉన్న అయ్యప్ప భక్తులు నరేష్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే అరెస్ట్ చేస్తారన్న భయంతో అక్కడి నుంచి తప్పించుకోబోయే క్రమంలో నరేష్ కారు బోల్తాపడింది.
ఎస్సై కృష్ణప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. ములుగు జిల్లా ఏటూరునాగారంలోని బీఆర్ ఫంక్షన్ హాలులో సోమవారం భారత నాస్తిక సమాజం అధ్యక్షుడు కొండగొర్ల రాజేశ్ ఆధ్వర్యంలో భీమా కోరే గావ్ స్ఫూర్తి దినం సందర్భంగా విజయ్ దివస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి చీఫ్ గెస్ట్‌గా బైరి నరేష్‌ను ఆహ్వానించారు. ఈ విషయం తెలుసుకున్న అయ్యప్ప స్వాములు, కొందరు శివ స్వాములు అక్కడికి చేరుకున్నారు. గతంలో బైరి నరేష్ అయ్యప్ప స్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో బహిరంగంగా క్షమాపణ చెప్పాలని అయ్యప్ప భక్తులు డిమాండ్ చేశారు. నరేష్‌ను అక్కడి నుంచి వెళ్లిపోవాల్సిందిగా వాగ్వాదానికి దిగారు. తనపై దాడి చేస్తారన్న భయంతో నరేష్ కారు ఎక్కి డ్రైవర్‌ను త్వరగా వెళ్లాలని చెప్పారు. ఈ క్రమంలో డ్రైవర్... ఎదురుగా బైక్‌పై ఉన్న పోగు నర్సింహులు అనే అయ్యప్ప మాలధారున్ని ఢీకొట్టి వేగంగా వెళ్లిపోయారు. ఈ ఘటనలో నర్సింహులు కాలు విరగ్గా.. పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. నర్సింహులుకు ప్రాథమిక చికిత్స అనంతరం వరంగల్ తరలించారు. ఈ సంఘటనకు బాధ్యుడిగా పేర్కొంటూ కొండగొర్ల రాజేష్‌ను అయ్యప్ప స్వాములు పోలీసులకు అప్పగించారు. అనంతరం ర్యాలీ నిర్వహించి ప్రధాన రహదారిపై ఆందోళన చేశారు. వారి ఫిర్యాదు మేరకు బైరి నరేష్‌తోపాటు ఆయన డ్రైవర్‌పై కేసు నమోదు చేసినట్లుగా ఎస్సై కృష్ణప్రసాద్ తెలిపారు.
బైరి నరేష్ వరంగల్ వెళ్తున్నారనే సమాచారంతో ఎస్సై కృష్ణప్రసాద్ సిబ్బందితో వెళ్లి అటవీశాఖ చెక్‌పోస్టు వద్ద కాపు కాశారు. వారిని గమనించిన నరేష్ తన వాహనాన్ని భద్రాచలం రోడ్డు వైపు మళ్లించారు. దీంతో పోలీసులు వెంబడిస్తూ వెళ్తుండగా స్థానిక జీడివాగు మూలమలుపు వద్ద నరేష్ కారు గుంతలో పడి ఎగిరి వెళ్లి మైలురాయికి ఢీకొట్టింది. పోలీసులు వెళ్లేలోపు బైరి నరేష్, కారు డ్రైవరు అక్కడి నుంచి పారిపోయారు. ఆ కారులో మరో ఇద్దరు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. బైరి నరేష్ గతంలోనూ దేవుళ్లపై, అయ్యప్ప స్వామిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.