Home > తెలంగాణ > తగ్గేదేలే.. బీజేపీలో పాత వర్సెస్ కొత్త నేతలు..

తగ్గేదేలే.. బీజేపీలో పాత వర్సెస్ కొత్త నేతలు..

తగ్గేదేలే.. బీజేపీలో పాత వర్సెస్ కొత్త నేతలు..
X

బీజేపీని సిద్ధాంతాల పార్టీగా ఆ నేతలు చెప్పుకుంటారు. కానీ ఇప్పుడు ఆ పార్టీలో సిద్ధాంతాల కంటే రాద్ధాంతాలు ఎక్కువయ్యాయి. కర్నాటక ఫలితంతో రాష్ట్రంలో బీజేపీ సీన్ మొత్తం రివర్స్ అయ్యింది. కాంగ్రెస్లోనే గ్రూప్ రాజకీయాలు, అంతర్గత కుమ్ములాటలు ఎక్కువని అనుకంటే.. తెలంగాణ బీజేపీలో అంతకుమించి కుమ్ములాటలు నెలకొన్నాయనే విమర్శలు ఉన్నాయి. కొత్త నేతల వల్లే పార్టీ ప్రతిష్ట దిగజారుతుందని పాత నేతలు చెబుతుండగా.. తమ వల్లే పార్టీ జోష్ పెరిగిందని ఇతర పార్టీల నుంచి కొత్తగా వచ్చిన నేతలు చెప్పుకుంటున్నారు.

గతంలో బీజేపీలో ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్న నేతలే ఎక్కువ ఉండేవారు. అయితే గత నాలుగేళ్లుగా ఆ పార్టీలోకి ఇతర పార్టీల నేతలు క్యూకట్టారు. ఇతర పార్టీల్లో పొసగని నాయకులంతా వచ్చి బీజేపీలో చేరారు. ఇక అప్పటునుంచి ఆ పార్టీలో లొల్లీలు షురూ అయినట్లు తెలుస్తోంది. ఆ లొల్లి ఏకంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని మార్చేంతవరకు వెళ్లాయి. రాష్ట్ర అధ్యక్షుడిని మార్చిన ఈ కుమ్ములాటలు మాత్రం ఆగడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

కొత్త నేతల తీరుతో బండి దిగిన సంజయ్..

పార్టీలో కొత్తగా వచ్చిన నేతలు బండి సంజయ్పై చెడుగా చెప్పడంతోనే ఆయన్ను మార్చారనే ఆరోపణలున్నాయి. ఈటల, రఘునందన్ రావు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వంటి నేతల వల్లే సంజయ్ అధ్యక్ష బండి దిగాడని ఆయన సన్నిహితులు ఆరోపిస్తున్నారు. ‘‘నాపై చెప్పినట్లు కొత్త అధ్యక్షుడిపై చాడీలు చెప్పకండన్నా అని సంజయ్ బహిరంగంగానే చెప్పడం ఆ పార్టీ పరిస్థితికి అద్దం పడుతోంది. బండి వ్యాఖ్యలపై అధిష్టానం సీరియస్ అయినట్లుగా వార్తలు సైతం వచ్చాయి.

కుమ్ములాటలు తగ్గేదేలే..

ఇప్పటివరకు రాష్ట్రంలో ఉన్న ఊపును కాస్త తగ్గిస్తూ బండి సంజయ్ స్థానంలో కిషన్ రెడ్డిని రాష్ట్ర అధ్యక్షునిగా అధిష్టానం నియమించిందని విశ్లేషకులు చెబుతున్నారు. ఆ తర్వాత అయినా గొడవలు తగ్గుతాయనుకుంటే.. తగ్గేదేలే అన్నట్లుగా పరిస్థితి ఉందట. అధ్యక్షుడిని మార్చే సమయంలోనే రఘునందన్ రావు వంటి నేతలు పార్టీ తీరుపై తీవ్ర ఆరోపణలు చేశారు. కష్టపడి పనిచేసే నాయకులను పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఈటల, కోమటిరెడ్డి సైతం పార్టీ మారుతారనే ప్రచారం జరిగినా.. ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ పదవితో ఈటల సైలెంట్ అయ్యారు.


ఉత్తర తెలంగాణలో..

ఉత్తర తెలంగాణలో ఈ అంతర్గత విభేదాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. అటు బండి సంజయ్ మార్పుతో ఉమ్మడి కరీంనగర్, ఎంపీ సోయం సహా పలువురి నేతల తీరుతో ఉమ్మడి అదిలాబాద్, ఎంపీ అర్వింద్ తీరుతో నిజిమాబాద్ జిల్లాలో ఈ లొల్లిలు ఎక్కువున్నాయట. అదిలాబాద్లో సోయం తీరుపై పార్టీ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్, రమేష్ రాథోడ్ వంటి నేతలు ఇప్పటికే తీవ్ర ఆరోపణలు చేశారు. ఇక ఉమ్మడి కరీంనగర్లో.. పరిస్థితి ఈటల వర్సెస్ బండిగా మారింది.


అర్వింద్ తీరుతో..

ప్రస్తుతం నిజామాబాద్ జిల్లాలో బీజేపీలోని అంతర్గత లొల్లిని మరోసారి బయటపెట్టింది. ఏకపక్షంగా మండలాధ్యక్షులను మార్చారని ఆరోపిస్తూ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిరసన చేపట్టారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్మూర్ నుంచి వినయ్ రెడ్డి, బాల్కొండలో రుయ్యాడి రాజేశ్వర్‌ బీజేపీ తరుపున పోటీ చేశారు. అయితే ఆర్మూర్లో రాకేష్ రెడ్డి, బాల్కొండలో మల్లిఖార్జున్ రెడ్డి బీజేపీలో చేరడం వీరి అసంతృప్తికి కారణమైంది. తమకు చెప్పకుండానే ఎంపీ అర్వింద్ వారిని పార్టీలో చేర్చుకున్నారని.. వినయ్, రుయ్యాడి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇదే క్రమంలో మండలాధ్యక్షులను మార్చడం ఆందోళనకు దారితీసింది.

మా వల్లే పార్టీలో జోష్..

మరోవైపు కొత్త వచ్చిన నేతలు అంతా తామే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని పాత నేతలు ఆరోపిస్తున్నారు. తమ వల్లే పార్టీకి జోష్ వచ్చిందని చెప్పుకుంటున్నారని వారు వాపోతున్నారు. అంతేకాకుండా పాతవారిని కాదని.. కొత్తగా వచ్చిన నాయకులకు అధిష్టానం కీలక బాధ్యతలు అప్పగించడంపై పాత నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. అప్పట్లో పార్టీలో కుమ్ములాటలు అనేవే లేవని.. కొత్తగా వచ్చిన నాయకులతో పార్టీ పరువు పోతుందని వారు సన్నిహితుల దగ్గర చెప్పుకుంటున్నారట.

ఆర్ఎస్ఎస్ భావజాలం గల పాత నేతలతో కొత్త నేతలకు అంతగా సెట్ అవ్వడం లేదని తెలుస్తోంది. అప్పటి నేతలకు పూర్తి కాంట్రాస్ట్గా కొత్త నేతలు వ్యవహరిస్తుండడం అంతర్గత కుమ్ములాటలకు తావిస్తున్నాయి. ఇప్పటికీ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి తామే ప్రత్యామ్నాయం అని చెప్పుకునే బీజేపీ.. ముందు సొంతింటిని చక్కదిద్దుకోవాలనే విమర్శలు వస్తున్నాయి. ప్రత్యమ్నాయం తర్వాత పార్టీలో పరిస్థితులు ఇలాగే ఉంటే వచ్చే సీట్లు కూడా రావని పలువురు గుసగుసలాడుతున్నారు.

Updated : 26 July 2023 2:43 PM GMT
Tags:    
Next Story
Share it
Top