తెలంగాణ వ్యాప్తంగా ఘర్షణలు.. లాఠీ చార్జీలు
X
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ చెదురుమదరు ఘర్షణల నడుమ సాగుతోంది. పార్టీ శ్రేణుల మధ్య ఘర్షణలు, నిబంధనల ఉల్లంఘన, ఈవీఎంల మొరాయింపు తదితర సంఘటనలు వెలుగుచూస్తున్నాయి. అల్లరి మూకలను చెదరగొట్టడానికి పోలీసులు లాఠీలు ఝుళిపిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఖానాపూర్‌లో బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య గొడవలు జరిగాయి. పరస్పరం దాడులకు దిగడంతో పోలీలకు లాఠీఛార్జ్ చేసి చెదరగొట్టారు. బోధన్ లోనూ ఇలాంటి దృశ్యాలే కనిపించాయి.
జనగామ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల 245 పోలింగ్ కేంద్రం వద్ద ఘర్షణ జరిగింది. బీఆర్ఎస్ శ్రేణులతో కాంగ్రెస్, సిపిఐ, బీజేపీ శ్రేణులు తప్పడ్డాయి. కేంద్రం వద్ద అధికార పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున గుమికూడడంపై విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో భౌతిక దాడులు మొదలయ్యాయి. ఖమ్మం కూసుమంచిలోనూ ఉద్రిక్తత తలెత్తింది. నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మన్ననూర్ గ్రామంలో బీఅర్‌ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు పరస్పరం దాడులు చేసుకున్నారు. అమ్రాబాద్ సీఐ ఆదిరెడ్డి లాఠీకి పని చెప్పారు. పలు బూత్‌లలోకి అభ్యర్థులు, పార్టీల నాయకులు అనుమతి లేకుండా వెళ్లడం ఉద్రిక్తతలకు దారితీస్తోంది. పలుచోట్ల పార్టీలు ఓటర్లకు డబ్బులు పంచుతున్నట్లు వార్తలు వస్తున్నాయి తాండూర్ మండలం కరన్‌కట్‌లో దాదాపు రూ. 8 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డబ్బు పంచుతున్న వ్యక్తులు పోలీసులు అక్కడి చేరుకోవడం పారిపోయారు.