కేటీఆర్ అడ్డుగోలుగా మాట్లాడితే సహించం : భట్టి
X
కేటీఆర్ అడ్డుగోలుగా మాట్లాడితే సహించేది లేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. చదువుకున్న కేటీఆర్కు ప్రపంచజ్ఞానం ఉందనుకున్నా కానీ అలా మాట్లాడడం సరికాదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ 75 నుంచి 80సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్‌రావుకు ప్రజలే తగిన బుద్ధి చెప్తారని మండిపడ్డారు.
‘‘ కేటీఆర్కు ప్రపంచ జ్ఞానం ఉందనుకున్నా. కానీ 150 ఏళ్ల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీరి వారెంటీ లేదు.. గ్యారెంటీ లేదు.. ముసలి నక్కా అని మాట్లాడం కరెక్ట్ కాదు. నీ కంటే ఎక్కువ భాష మాట్లాడగలను. కానీ సభ్యతా, సంస్కారం అడ్డు వస్తోంది. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. ప్రభుత్వం, ప్రతిపక్షం రెండూ ఉండాలి. ప్రజలు ఇచ్చే దరఖాస్తు తీసుకునే ధైర్యం నీకు లేదు. అడ్డగోలుగా మాట్లాడితే సహించేది లేదు. కాంగ్రెస్‌కు ప్రజలు 75-80 సీట్లు ఇవ్వబోతున్నారు’’ అని భట్టి అన్నారు.
కేటీఆర్ సూట్ వేసుకుని సిలికాన్ వ్యాలీలో తిరగడానికి కాంగ్రెస్ పార్టీనే కారణమని భట్టి చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఉచిత కరెంటు, రుణమాఫీ, పేదలకు ఇళ్లు, పింఛన్లు అందజేసిందన్నారు. కాళేశ్వరం పేరుతో కేసీఆర్ ప్రజాధనాన్ని దోపిడీ చేస్తున్నారని.. దోపిడీకి గురైన ప్రజాధనాన్ని కాంగ్రెస్ అధికారంలోకి రాగానే తిరిగి ప్రజలకు పంచుతామని చెప్పారు. కేసీఆర్, కేటీఆర్ ఎన్ని కుట్రలు చేసిన కాంగ్రెస్ గెలుపును ఆపలేరన్నారు.