సర్వే ప్రకారమే టిక్కెట్లు..ఇంకా చాలా మంది పార్టీలోకి వస్తారు : భట్టి
X
ఖమ్మం సభ సక్సెస్తో కాంగ్రెస్ పార్టీ ఫుల్ జోష్లో ఉంది. ఎన్నికలు దగ్గర పడుతుండడంతో ప్రస్తుతం టిక్కెట్ల చర్చ మొదలైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవరు ఆందోళన చెందొద్దని.. సర్వేల ప్రకారమే టిక్కెట్లు కేటాయించడం జరుగుతుందని స్పష్టం చేశారు. పార్టీ కోసం కష్టపడి ప్రజల్లో ఉన్నవారికే టిక్కెట్లు వస్తాయన్నారు.
కాంగ్రెస్లో చేరడానికి చాలా మంది నేతలు సిద్దంగా ఉన్నారని.. అంతా ఒకేసారి చేరరు అని భట్టి చెప్పారు. విడతల వారీగా కాంగ్రెస్లో చేరతారని వివరించారు. ఇక రాష్ట్రంలో బీజేపీ పని అయిపోయిందని భట్టి అన్నారు. బీఆర్‌ఎస్.. బీజేపీకి బీ టీమ్ అని ఆరోపించారు. బీఆర్‌ఎస్‌కి ఓటు వేస్తే బీజేపీకి వేసినట్టేనని అన్నారు.
బీజేపీకి మేలు చేయాలన్నదే బీఆర్‌ఎస్ తాపత్రయమని భట్టి విమర్శించారు. అందులో భాగంగానే అఖిలేష్ యాదవ్‌ను.. సీఎం కేసీఆర్ హైదరాబాద్‌కు రప్పించుకున్నారని ఆరోపించారు. మోదీని గద్దె దించేందుకు ఏకమవుతున్న ప్రతిపక్షాల్లో చీలిక తెచ్చేందుకే బీ టీమ్ పనిచేస్తోందని విమర్శించారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలైన నీళ్లు, నిధులు, నియామకాలు.. కేసీఆర్ పాలనలో కలగానే మారాయని.. త్వరలోనే ప్రాజెక్టుల సందర్శన చేపడతామని చెప్పారు.