వికలాంగులకు గుడ్ న్యూస్.. పెన్షన్ పెంచిన సర్కార్
X
తెలంగాణలోని వికలాంగులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. వికలాంగులకు ఆసరా పెన్షన్లు పెంచుతున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం వికలాంగులకు ఇస్తున్న రూ. 3,116 పెన్షన్ను రూ. 4,116 కు పెంచుతున్నట్లు చెప్పారు. పెంచిన పెన్షన్లు వచ్చే నెల నుంచి అమల్లోకి వస్తాయని స్పష్టం చేశారు. మంచిర్యాల జిల్లాలో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రగతి నివేదన సభలో కేసీఆర్ ఈ ప్రకటన చేశారు.
‘‘ రాష్ట్రంలో ముసలమ్మలు, ముసలి తాతలు 2వేల ఆసరా పెన్షన్లతో ఎవరి మీద ఆధారపడకుండా మంచిగా బతుకుతున్నారు. వికలాంగులకు రూ. 3,116 పెన్షన్ ఇస్తున్నాం. ప్రస్తుతం తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంలో వికలాంగుల పెన్షన్ కూడా పెంచబోతున్నాం. మరో వెయ్యి రూపాయాలు పెంచుతున్నాం. మంచిర్యాల గడ్డ నుంచి ప్రకటించాలని ఇన్నాళ్లు నేను సస్పెన్షన్‌లో పెట్టాను. వచ్చే నెల నుంచి రూ. 4,116 పెన్షన్ అందుతుంది’’ అని కేసీఆర్ చెప్పారు.
అంతకుముందు మంచిర్యా కలెక్టరేట్ను ప్రారంభించిన కేసీఆర్.. అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ప్రజలకు మంచి జరగాలనే కొత్త జిల్లాలను ఏర్పాటు చేశామని కేసీఆర్ చెప్పారు.రాష్ట్రాభివృద్ధికి ఎన్నో సంస్కరణలు తెచ్చామని.. సంస్కరణలు అనేది నిరంతరం ప్రక్రియ అని అన్నారు. కరోనా, నోట్ల రద్దుతో ప్రజల జీవితాలు అతలాకుతలం అయ్యాయన్న సీఎం.. కష్టకాలంలోనూ తెలంగాణ అభివృద్ధిలో అగ్రస్థానంలో నిలిచిందని స్పష్టం చేశారు. కులమతాలకు అతీతంగా సంక్షేమ ఫలాలు అందిస్తున్నట్లు చెప్పారు. కులవృత్తులకు లక్ష రూపాయల చేయూత అందిస్తున్నామన్నారు.కంటి వెలుగు కార్యక్రమం విజయవంతంగా సాగుతోందని కేసీఆర్ చెప్పారు. ఢిల్లీ పంజాబ్ రాష్ట్రాల్లో కూడా కంటి వెలుగు కొనసాగిస్తామని అక్కడి సీఎం చెప్పారని వివరించారు.
వరి ధాన్యం ఉత్పత్తిలో పంజాబ్ను తెలంగాణ ధాటేసిందన్నారు. గొర్రెల పెంపకంలో తెలంగాణ నెంబర్ వన్ స్థానంలో ఉందని తెలిపారు. అభివృద్ధి ఫలాలను ప్రజలకు అందిస్తున్న అధికారులకు ఆయన అభినందనలు తెలిపారు. దేశానికే తలమానికంగా తెలంగాణ నిలుస్తోందని చెప్పారు.