Home > తెలంగాణ > ఇచ్చిన మాట తప్పం.. చెప్పంది చేస్తాం -

ఇచ్చిన మాట తప్పం.. చెప్పంది చేస్తాం -

ఇచ్చిన మాట తప్పం.. చెప్పంది చేస్తాం -
X

సీఎం కేసీఆర్ రాజులా వ్యవహరిస్తున్నాడని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. కల్వకుర్తిలో నిర్వహించిన ప్రజా భేరీ సభలో పాల్గొన్న ఆయన కేసీఆర్ పాలనపై నిప్పులు చెరిగారు. తెలంగాణ ప్రజలు ఎన్నో కలలు కన్నారని అవన్నీ నిర్వీర్యం అయ్యాయని చెప్పారు. ఆదాయం వచ్చే శాఖలన్నీ కేసీఆర్, ఆయన కుటుంబసభ్యుల దగ్గరే ఉన్నాయని రాహుల్ ఆరోపించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దొరల తెలంగాణ - ప్రజల తెలంగాణ మధ్య జరుగుతున్న యుద్ధమని అన్నారు.

కాంగ్రెస్ హయాంలో నాగార్జున సాగర్, జూరాల, సింగూరు ప్రాజెక్టులు కట్టామని రాహుల్ గాంధీ గుర్తు చేశారు. దళితులు, బడుగు బలహీనవర్గాలకు భూములు ఇచ్చామని చెప్పారు. ధరణి పేరుతో కేసీఆర్ సర్కారు పేదల భూములు లాక్కుంటోందని రాహుల్ ఆరోపించారు. 20లక్షల మందికిపైగా రైతులకు ధరణితో నష్టం జరుగుతోందని అన్నారు.

కేసీఆర్కు బై బై చెప్పే సమయం వచ్చిందన్న రాహుల్.. ప్రజల నుంచి దోచుకున్న సొమ్మంతా కక్కించాలని అన్నారు. కాంగ్రెస్ హామీ ఇచ్చిందంటే నెరవేర్చి తీరుతుందని, తాను మోడీలా కాదని, మాట ఇస్తే దాన్ని అమలు చేస్తానని స్పష్టం చేశారు. నల్లధనం వెనక్కి తీసుకొచ్చి ప్రతి ఒక్కరి అకౌంట్లో రూ.15లక్షలు వేస్తానని మోడీ చెప్పారని, ఒక్కరి ఖాతాలో అయినా ఒక్క రూపాయైనా పడిందా అని ప్రశ్నించారు. కానీ అదానీ అకౌంట్లో మాత్రం లక్షల కోట్లు చేరాలని రాహుల్ గాంధీ విమర్శించారు.

తెలంగాణ ప్రజలతో తనకున్నది కుటుంబపరమైన అనుబంధమని రాహుల్ అన్నారు. అది ఈ నాటిది కాదని, నెహ్రూ, ఇందిరల కాలం నుంచి కొనసాగుతోందని అన్నారు. ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే మహాలక్ష్మి పథకం కింద మహిళలందరికీ నెలకు రూ.2,500 ఇస్తామని రాహుల్ ప్రకటించారు. రూ. 500లకే గ్యాస్ సిలిండర్, మహిళలకు బస్సులో ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు. రైతులకు ఏటా ఎకరాకు రూ.15వేలు, రైతు కూలీలకు రూ. 12వేల చొప్పున ఆర్థిక సాయం ఇస్తామని అన్నారు. అర్హులైన వారందరికీ రూ.4వేల పింఛను అందిస్తామని, ప్రజలందరికీ రూ.10 లక్షల హెల్త్ ఇన్స్యూరెన్స్, గృహజ్యోతి స్కీం కింద ప్రతి నెలా 200యూనిట్ల ఫ్రీ కరెంటు ఇస్తామని రాహుల్ హామీ ఇచ్చారు.



Updated : 1 Nov 2023 11:10 AM GMT
Tags:    
Next Story
Share it
Top