అల్లు అర్జున్పై సీఎం కేసీఆర్ ప్రశంసల వర్షం
X
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పై సీఎం కేసీఆర్ ప్రశంసలు కురిపించారు. జాతీయ ఉత్తమ నటుడి అవార్డు గెలుచుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు. 69ఏళ్లలో తొలి తెలుగు హీరోకి ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు దక్కడం గొప్ప విషయమన్నారు. విలక్షణమైన రీతిలో తమ అత్యుత్తమ నటనతో అవార్డు గెలిచి.. తెలుగు చిత్ర రంగానికి గర్వకారణంగా నిలిచారని ప్రశంసించారు. అల్లు రామలింగయ్య, చిరంజీవి స్ఫూర్తితో స్వశక్తితో ఎదిగిన అల్లు అర్జున్ పట్టుదల, కృషి అభినందనీయమన్నారు.
అదేవిధంగా జాతీయ అవార్డులు గెలుచుకున్న వారందరినీ కేసీఆర్ అభినందించారు. ఉత్తమ లిరిసిస్ట్ చంద్రబోస్, మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్, సింగర్ కాలభైరవ, ఫిల్మ్ క్రిటిక్ పురుషోత్తమాచార్యులను సీఎం కంగ్రాట్స్ చెప్పారు. తెలుగు చలన చిత్ర రంగం హైదరాబాద్ కేంద్రంగా అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభను చాటుతుండడం గొప్ప విషయమన్నారు. తెలుగు చిత్ర రంగాభివృద్ధికోసం రాష్ట్ర ప్రభుత్వం తన వంతు కృషి కొనసాగిస్తూనే వుంటుందని సీఎం స్పష్టం చేశారు. విభిన్న సంస్కృతుల మేళవింపుతో భవిష్యత్తులో తెలుగు సినిమా విశ్వవ్యాప్తంగా మరింతగా విస్తరించాలని ఆకాంక్షించారు.
చిరంజీవి అభినందనలు..
అల్లు అర్జున్‌కు జాతీయ అవార్డు రావడంపై మెగాస్టార్ చిరంజీవి సంతోషం వ్యక్తం చేశారు. చిరంజీవి - సురేఖ దంపతులను బన్నీ కలిశారు. బన్నీకి వారు పుష్పగుచ్ఛం అందచేసి స్వీట్స్ తినిపించారు. చిరంజీవి విషెస్‌తో బన్నీ చాలా సంతోషించారు. దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.