వీఆర్ఏలను ఆ శాఖల్లో సర్దుబాటు చేయండి.. కేసీఆర్
X
వీఆర్ఏ వ్యవస్థ రద్దుతో ఖాళీగా ఉన్న వీఆర్ఏలను ఇతర ప్రభుత్వ యంత్రాంగాల్లో సర్దుబాటు చేసే విషయంపై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. గ్రామ రెవెన్యూ సహాయకుల విద్యార్హతలు, ప్రతిభాపాటలవాలను బట్టి నీటి పారుదల శాఖతోపాటు ఇతర ప్రభుత్వ శాఖల్లో నియమించుకోవాలని అధికారులను ఆదేశించారు. శుక్రవారం సచివాలయంలో ఈ అంశంపై ఆయన మంత్రులతో, ఉన్నతాధికారులతో మాట్లాడారు. వీఆర్‌ఏల సేవలు ప్రభుత్వ విభాగాలు వాడుకోవాలన్న ఆయన వారి అభీష్టం ప్రకారం వారం లోపు నిర్ణయం తీసుకోవాలన్నారు. సర్దుబాటుకు సంబంధించి మంత్రి కేటీఆర్ సారథ్యంలో మంత్రివర్గ ఉప సంఘాన్ని కూడా సీఎం ఏర్పాటు చేశారు. ఇది శనివారం నుంచి వీఆర్‌ఏలతో చర్చలు జరిపి ప్రభుత్వానికి సూచనలు అందజేస్తుంది. ఉప సంఘంలో జగదీశ్ రెడ్డి, సత్యవతి రాథోడ్ ఉన్నారు. కమిటీ నివేదిక ఇచ్చాక సీఎం మరోసారి సమీక్షా సమావేశం నిర్వహించి తుది నిర్ణయం తీసుకుంటారు.