Home > తెలంగాణ > గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా దాసోజు, కుర్ర సత్యనారాయణ

గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా దాసోజు, కుర్ర సత్యనారాయణ

గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా దాసోజు, కుర్ర సత్యనారాయణ
X

సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన తెలంగాణ కేబినెట్ భేటీ ముగిసింది. దాదాపు 5గంటల పాటు సాగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనంతో పాటు గవర్నర్ కోటా ఎమ్మెల్సీలను ఖరారు చేసినట్టు మంత్రి కేటీఆర్ ప్రకటించారు. ఎస్టీ కోటా నుంచి కుర్రా సత్యనారాయణ, బీసీ కోటా నుంచి దాసోజు శ్రవణ్ కు అవకాశం ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించినట్లు చెప్పారు. ఎమ్మెల్సీల ఎంపికకు సంబంధించి గవర్నర్ నుంచి ఎలాంటి అభ్యంతరం ఉండదని మంత్రి కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు.

బిల్లులకు మళ్లీ ఆమోదం

మోడీ సర్కారు గవర్నర్ను అడ్డుపెట్టుకుని రాజకీయం చేస్తుందని కేటీఆర్ ఆరోపించారు. గవర్నర్ వెనక్కి పంపిన బిల్లులను మరోసారి అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదిస్తామని చెప్పారు. శాసనసభలో రెండోసారి ఆమోదం పొందిన బిల్లును తిప్పిపంపే అధికారం గవర్నర్ కు ఉండదని గుర్తు చేశారు.

బీజేపీకి గుడ్ బై చెప్పి

రేవంత్ రెడ్డి వ్యవహారం నచ్చక గతేడాది బీజేపీలో చేరిన దాసోజు శ్రవణ్ బీజేపీలో ఇమడలేక బీఆర్ఎస్ లో చేరారు. అయితే పార్టీలో ఆయనకు ఎలాంటి పదవి ఇవ్వలేదు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఖైరతాబాద్ టికెట్ ఆశించినట్లు వార్తలు వచ్చాయి. గతంలో దాసోజు ఈ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా శ్రవణ్ పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం ఖైరతాబాద్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఉన్నందున దాసోజును ఎమ్మెల్సీగా చట్టసభకు పంపాలని కేసీఆర్ నిర్ణయించినట్లు తెలుస్తోంది.

నెరవేరనున్న కల

ప్రజారాజ్యం పార్టీతో రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన దాసోజు శ్రవణ్.. ఉద్యమ సమయంలో చిరంజీవి సమైక్యాంధ్ర స్టాండ్ తీసుకోవడంతో ఆ పార్టీకి గుడ్ బై చెప్పి బీఆర్ఎస్‌లో చేరారు. అయితే ఆయనకు టికెట్ ఇవ్వకపోవడంతో ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరారు. ఖైరతాబాద్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. దీంతో కాంగ్రెస్ పార్టీ మంచి వాగ్దాటి ఉన్న ఆయనకు జాతీయ అధికార ప్రతినిధి హోదా ఇచ్చారు. అయితే రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్ అయిన తర్వాత పార్టీలో ప్రాధాన్యం తగ్గిపోయిందన్న అసంతృప్తితో కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి బీజేపీలో చేరారు. రెండు నెలలు గడిచినా ఆయనకు ఎలాంటి పదవి ఇవ్వకపోవడంతో మళ్లీ బీఆర్ఎస్‌లో కండువా కప్పుకున్నారు. తాజాగా సీఎం కేసీఆర్ ఎమ్మెల్సీగా ఎంపిక చేయడంతో చట్టసభలో అడుగుపెట్టాలన్న దాసోజ్ శ్రవణ్ కల నెరవేరనుంది.


Updated : 31 July 2023 4:57 PM GMT
Tags:    
Next Story
Share it
Top