నేడు తొర్రూరు, హాలియా, ఇబ్రహీంపట్నంలో కేసీఆర్ సభలు
X
గులాబీ దళపతి, సీఎం కేసీఆర్ తన ప్రచారంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో నూతన ఉత్తేజాన్ని నింపుతున్నారు. ప్రజా ఆశీర్వాద సభలతో రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేస్తున్న ముఖ్యమంత్రి.. మూడోసారి గెలిచి హ్యాట్రిక్ సీఎం కావాలని ఉవ్వెళ్లూరుతున్నారు. అందులో భాగంగా గత నెల అక్టోబర్ 15న ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఇక ప్రచారంలో భాగంగా నేడు పాలకుర్తి నియోజకవర్గం పరిధిలోని మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో జరిగే సభలో పాల్గొననున్నారు. ఇందుకోసం మహబూబాబాద్ రోడ్లోని సభాస్థలిలో బీఆర్ఎస్ శ్రేణులు ఏర్పాట్లు చేశారు. పాలకుర్తి అభ్యర్థి, మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు.. కేసీఆర్ పర్యటనను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఈ సభకు దాదాపు 80 వేల నుంచి లక్ష మంది వరకూ హాజరవుతారని బీఆర్ఎస్(BRS) అంచనా వేస్తుంది.
ఇప్పటికే ఉమ్మడి వరంగల్ జిల్లాలో జనగామ, మహబూబాబాద్, వర్ధన్నపేట, నర్శంపేట నియోజకవర్గాల్లో సీఎం ప్రజా ఆశీర్వాద సభలు నిర్వహించారు. ఇప్పుడు జరుగుతున్న సభ ఈ జిల్లాలో ఐదోది. ముఖ్యమంత్రి రాక సందర్భంగా పోలీసులు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లను చేస్తున్నారు. పాలకుర్తి సభ అనంతరం.. ముఖ్యమంత్రి హెలికాప్టర్లో నాగార్జున సాగర్ నియోజకవర్గంలోని హాలియా.. తర్వాత ఇబ్రహీంపట్నం సభల్లోనూ పాల్గొననున్నారు. మధ్యాహ్నం నుంచి కేసీఆర్ సభలు ప్రారంభం కానున్నాయి.