Home > తెలంగాణ > త్యాగాలకు సిద్ధపడ్డప్పుడే సమాజ హితం జరుగుతుంది.. సీఎం కేసీఆర్

త్యాగాలకు సిద్ధపడ్డప్పుడే సమాజ హితం జరుగుతుంది.. సీఎం కేసీఆర్

త్యాగాలకు సిద్ధపడ్డప్పుడే సమాజ హితం జరుగుతుంది.. సీఎం కేసీఆర్
X

రాష్ట్ర ప్రజలకు బక్రీద్‌ శుభాకాంక్షలు తెలిపారు ముఖ్యమంత్రి కేసీఆర్‌. సమష్టి ప్రయోజనం కోసం వ్యక్తిగతస్వార్ధాన్ని విడిచి త్యాగాలకు సిద్ధపడ్డప్పుడే సమాజహితం జరుగుతుందన్నారు. త్యాగాలద్వారా ప్రాప్తించిన ప్రయోజనాలు సమానంగా అందినప్పుడే.. ఆ త్యాగాలకు సార్థకత చేకూరుతుందన్న సందేశాన్ని.. బక్రీద్ విశ్వమానవాళికి అందిస్తుందని కేసీఆర్ పేర్కొన్నారు. బక్రీద్ పండుగ భక్తి, త్యాగం, కరుణ, విశ్వాసం అనే గొప్ప గుణాలను ప్రజల్లో పెంపొందిస్తుందని అన్నారు. సకల మత విశ్వాసాలను సాంప్రదాయాలను గౌరవిస్తూ తెలంగాణలో పాలన కొనసాగుతున్నదని పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజలు శాంతియుతంగా కలిసిమెలసి జీవించేలా, గంగ జమున తహజీబ్‌ను కాపాడుకుంటూ తెలంగాణ ఆధ్యాత్మిక పరంపరంను కొనసాగిస్తున్నామన్నారు. దేశానికే ఆదర్శవంతమైన లౌకిక ఆధ్యాత్మిక కార్యాచరణ రాష్ట్రంలో అమలవుతుందని తెలిపారు. మైనారిటీల అభివృద్ధి, సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను విజయవంతంగా అమలు చేస్తుందని వివరించారు.

ఇక గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్ కూడా ముస్లింలకు బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. త్యాగస్ఫూర్తికి, అత్యున్నత భక్తికి బక్రీద్‌ ప్రతీక అని అన్నారు. ఈ పండుగ సోదరభావం, సేవ, త్యాగం యొక్క స్ఫూర్తిని మరింత బలోపేతం చేస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఇస్లాం విశ్వాసంలో బక్రీద్‌కు ప్రత్యేక స్థానం ఉందని తమిళిసై అన్నారు.

బక్రీద్ సందర్భంగా హైదరాబాద్‌లో.. పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. మీర్ ​ఆలం ఈద్గా వద్ద ప్రత్యేక భద్రత చర్యలు చేపట్టారు. ప్రార్ధనలకు.. సుమారు 30,000 మంది హజరయ్యే అవకాశం ఉందని అంచనా. ఇప్పటికే అన్నిశాఖల అధికారులతో.. పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ సమావేశం నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే ముస్లింల ప్రత్యేక ప్రార్థనల నేపథ్యంలో ట్రాఫిక్​ను ప్రత్యామ్నాయ మార్గాలకు మళ్లించనున్నట్లు పోలీసులు తెలిపారు.

Updated : 29 Jun 2023 10:22 AM IST
Tags:    
Next Story
Share it
Top