Home > తెలంగాణ > పులి బిడ్డల్లా కొట్లాడితే గత్యంతరం లేక తెలంగాణ ఇచ్చారు - సీఎం కేసీఆర్

పులి బిడ్డల్లా కొట్లాడితే గత్యంతరం లేక తెలంగాణ ఇచ్చారు - సీఎం కేసీఆర్

పులి బిడ్డల్లా కొట్లాడితే గత్యంతరం లేక తెలంగాణ ఇచ్చారు - సీఎం కేసీఆర్
X

ఆర్డీఎస్ను ఆగం పట్టించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ సొంతమని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. కృష్ణా, తుంగభద్ర నదుల మధ్య ఉన్న నడిగడ్డను సైతం నాశనం చేశారని మండిపడ్డారు. గద్వాలలో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న కేసీఆర్.. కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ వ‌చ్చుడో.. నినాదంతో తాను ఆమ‌ర‌ణ దీక్ష చేప‌డితే ప్రజలంతా ఎక్క‌డివారు అక్క‌డ పులిబిడ్డ‌ల్లా కొట్లాడితే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్ర‌క‌టన చేసి మ‌ళ్లీ వెన‌క్కి తీసుకుందని అన్నారు. అంద‌రూ క‌లిసి కొట్లాడితే త‌ప్ప‌ని ప‌రిస్థితుల్లో తెలంగాణ ఇచ్చార‌ని కేసీఆర్ గుర్తు చేశారు.

తెలంగాణ రాకముందు ఉమ్మ‌డి పాల‌మూరు జిల్లా నాయ‌కులెవరూ నీళ్ల‌ కోసం కొట్లాడ‌లేదని కేసీఆర్ అన్నారు. ర‌ఘువీరారెడ్డి వ‌స్తే అనంత‌పురం దాకా నీళ్లు తీసుకువెళ్ల‌మ‌ని హార‌తులు ప‌ట్టారని మండిపడ్డారు. గ‌తంలో నెట్టెంపాడు కింద 20 వేల ఎక‌రాలకు కూడా సాగునీరు పార‌లేదని ప్రస్తుతం 1.60 లక్షల ఎక‌రాలకు పుష్కలంగా నీరందుతోందని చెప్పారు. రేలంపాడు రిజ‌ర్వాయ‌ర్ పెద్ద‌గా చేస్తే గ‌ద్వాల ప‌చ్చ‌బ‌డ్డ‌దని, గ‌ట్టు మండ‌లానికి నీళ్లు కావాల‌ని గ‌ట్టు ఎత్తిపోత‌ల ప‌థ‌కం కూడా తెచ్చామని కేసీఆర్ గుర్తు చేశారు.

బీఆర్ఎస్ హయాంలో గ‌ద్వాల‌లో మెడిక‌ల్ కాలేజీ, న‌ర్సింగ్ కాలేజీ వ‌చ్చిందని, 300 ప‌డ‌క‌ల ఆస్ప‌త్రి నిర్మాణం జ‌రుగుతోందని కేసీఆర్ చెప్పారు. ఘన చరిత్ర కలిగిన గద్వాల నియోజకవర్గంలో వాల్మీకి, బోయలు ఎక్కువగా ఉంటారని, వారు ఆంధ్రాలో ఎస్టీలుగా, తెలంగాణలో బీసీలుగా ఉన్నారని చెప్పారు. ఇదంతా ఏపీ తొలి సీఎం నీలం సంజీవరెడ్డి పాపమేనని అన్నారు. వారిని ఎస్టీ జాబితాలో చేర్చాలని రెండు సార్లు అసెంబ్లీలో తీర్మానం చేసి పంపినా మోడీ సర్కారు పట్టించుకోలేదని కేసీఆర్ మండిపడ్డారు.


Updated : 6 Nov 2023 5:48 PM IST
Tags:    
Next Story
Share it
Top