Home > తెలంగాణ > కాంగ్రెస్కు అధికారమిస్తే పదేండ్ల కష్టం బూడిదపాలు - కేసీఆర్

కాంగ్రెస్కు అధికారమిస్తే పదేండ్ల కష్టం బూడిదపాలు - కేసీఆర్

కాంగ్రెస్కు అధికారమిస్తే పదేండ్ల కష్టం బూడిదపాలు - కేసీఆర్
X

కాంగ్రెస్ పార్టీకి అధికారమిస్తే పదేండ్ల కష్టం బూడిదపాలవుతుందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధి కండ్ల ముందు కనిపిస్తోందని చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా చొప్పదండిలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొన్నారు. కాంగ్రెస్ గెలిస్తే అభివృద్ధిలో మళ్లీ వెనకబడిపోతామని హెచ్చరించారు.

కరెంటు, రైతు బంధు, ధరణి విషయంలో కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలపై కేసీఆర్ ఫైర్ అయ్యారు. వ్యవసాయానికి 24 గంటల కరెంటు అవసరం లేదని అంటున్నారని మండిపడ్డారు. రైతులు 10 హెచ్పీ మోటర్ పెట్టుకుంటే 3 గంటల కరెంటు సరిపోతుందని టీపీసీసీ చీఫ్ చెబుతున్నాడని కేసీఆర్ అన్నారు. రైతులకు 3 గంటల విద్యుత్ కావాలా లేక 24 గంటలు ఇచ్చే సర్కారు కావాలో ఆలోచించుకోవాలని చెప్పారు.

ప్రజలు కడుతున్న పనులను రైతు బంధు రూపంలో ఇచ్చి వేస్టు చేస్తున్నారని మరికొందరు కాంగ్రెస్ నాయకులు అంటున్నారని కేసీఆర్ ఫైర్ అయ్యారు. మళ్లీ అధికారంలోకి వచ్చాక ప్రస్తుతం రూ.10వేలుగా ఉన్న రైతు బంధు మొత్తాన్ని రూ.16వేలకు పెంచుతామని స్పష్టం చేశారు. ధరణి వచ్చాక భూముల పంచాయితీలు లేకుండా పోయాయని అలాంటి పోర్టల్ను బంగాళాఖాతంలో పడేస్తామంటున్న నాయకులు అవసరమా అని ప్రశ్నించారు. ధరణి స్థానంలో భూభారతి పోర్టల్ తెస్తామని చెబుతున్నారని, అలా చేస్తే మళ్లీ దళారీల రాజ్యం, అధికారుల పెత్తనం వస్తుందని కేసీఆర్ హెచ్చరించారు.

కర్నాటకలో 20 గంటల కరెంటు ఇస్తమన్న కాంగ్రెస్ కనీసం 5 గంటలు కూడా ఇవ్వడంలేదని కేసీఆర్ చెప్పారు. ఆ పార్టీని నమ్మి మోసపోయామని కర్నాటక రైతులు వాపోతున్నారని అన్నారు. వెయ్యి కోట్లతో కొండగట్టును అభివృద్ధి చేసి అద్భుతంగా తీర్చిదిద్దే బాధ్యత తనదని కేసీఆర్ స్పష్టం చేశారు.



Updated : 17 Nov 2023 3:59 PM IST
Tags:    
Next Story
Share it
Top