పిలిచి మరీ పదవులిస్తే.. తుమ్మల, పొంగులేటిపై కేసీఆర్ ఫైర్
X
పదవుల కోసం పూటకో పార్టీ మారేవాళ్లను పట్టించుకోవద్దని సీఎం కేసీఆర్ అన్నారు. తమకు ఎవరు మంచి చేస్తే వారినే గెలిపించాలని సూచించారు. పాలేరు ప్రజాశీర్వాద సభలో కేసీఆర్ ప్రసంగించారు. ఓడిపోయి ఇంట్లో కూర్చున్న తుమ్మలకు పిలిచి మరీ పదవులిచ్చామని చెప్పారు. తుమ్మలకు తాను అన్యాయం చేయలేదని.. బీఆర్ఎస్కే తుమ్మల అన్యాయం చేశారని విమర్శించారు. అప్పుడు మెచ్చుకున్న నోళ్లతోనే ఇప్పుడు తిడుతున్నారని.. అటువంటి నేతల మాటలు నమ్మకుండా పాలేరులో కందాల ఉపేందర్ రెడ్డిని గెలిపిస్తేనే మరింత అభివృద్ధి జరుగుతుందని స్పష్టం చేశారు.
మరికొంతమంది నాయకులు బీఆర్ఎస్ నేతలను అసెంబ్లీ గేటు కూడా దాటనివ్వమని మాట్లాడుతున్నారని.. ఆ నేతలకు ప్రజలే తగిన బుద్ధి చెప్తారని కేసీఆర్ అన్నారు. ‘‘ఈ జిల్లాలో ఒకరిద్దరు బహురూపుల నాయకులు ఉన్నారు. వాళ్లకు డబ్బు అహంకారం ఉంది. డబ్బుతో ఎవరినైనా కొనుగోలు చేయగలమని అనుకుంటున్నారు. వారిని నమ్మితే ప్రజలు ఆగమవుతారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలే వారి ఆట కట్టించాలి’’ అని కేసీఆర్ వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ గెలిస్తే రైతుబంధుకు రాంరాం.. దళితబంధుకు జైభీం పాడుతారని కేసీఆర్ అన్నారు. ఉత్తమ్ రైతు బంధు వేస్ట్ అంటుండు.. రేవంత్ కరెంట్ మూడు గంటలు చాలు అంటారని.. అటవంటి కాంగ్రెస్ నాయకుల మాయమాటలు నమ్మోద్దని సూచించారు. పాలేరు 40ఏళ్లు కరువుతో అల్లాడిందని.. బీఆర్ఎస్ వచ్చాక ఆ పరిస్థితిలో మార్పు వచ్చిందన్నారు. సీతారామ ప్రాజెక్టుతో ఖమ్మం కరువు పీడ తొలగిపోతుందని చెప్పారు. పాలేరులో బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపిస్తే నియోజకవర్గం మొత్తం దళితబంధు ఇస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు.