9 మెడికల్ కాలేజీలను ఒకేసారి ప్రారంభించిన కేసీఆర్.. ఏమన్నారంటే..
X
తెలంగాణలో శుక్రవారం 9 కొత్త ప్రభుత్వ కాలేజీలు మొదలయ్యాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వీటిని ఒకేసారి ప్రారంభించారు. కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, జయంశంకర్ భూపాలపల్లి, కుమ్రంభీం ఆసిఫాబాద్, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, జనగామ జిల్లాల్లోని మెడికల్ కాలేజీలను ప్రారంభిస్తున్నందుకు గర్వంగా ఉందని సీఎం అన్నారు. కాలేజీల్లో సీట్లు సంపాదించిన విద్యార్థుల స్వాగతం పలుకుతున్నానన్నారు.
జిల్లాకు ఒక మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం పట్టుదలతో పనిచేస్తోందన్నారు. ‘‘మనిషి ఆరోగ్యానికి తెల్లకణాలు ఎంత అవసరమో సమాజానికి తెల్లకోటు డాక్టర్లు అంతే అవసరం. దేశానికి అన్నం పెట్టే స్థాయికి ఎదిగిన రాష్ట్రం వైద్యరంగాన్ని కూడా అద్భుతంగా అభివృద్ధి చేస్తోంది. వెనకబడిన పాలమూరు, మూరుమూల ఆఫిఫాబాద్ వంటి జిల్లాల్లోనూ మెడికల్ కాలేజీలను అందుబాటులోకి తెచ్చాం. మెడికల్ కాలేజీలంటే పాఠాలు చెప్పేవి మాత్రమే కావు, ప్రజల ఆరోగ్యానికి పట్టుగొమ్మలు. వైద్యమంత్రి హరీశ్ రావు కృషితో చాలా విజయాలు సాధించాం. 85 శాతం సీట్లు రాష్ట్ర విద్యార్థులకే దక్కేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. రాష్ట్రంలో ఇప్పుడు అన్ని మెడికల్ కాలేజల్లో కలుపుకుని 8515 సీట్లు ఉన్నాయి. ఏటా పదివేల మంది డాక్టర్లును తయారు చేస్తాం’’ అన్నారు. దేశంలో లక్ష జనాభాకు 22 మెడికల్ సీట్లు ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే అని సీఎం అన్నారు. వైద్యవిద్యలో రాష్ట్రం దేశానికే ఆదర్శంగా మారడం తనకెంతో ఆత్మతృప్తి కగిలించిందన్నారు.
కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్ సహా పలు సంక్షేమ పథకాలతో రాష్ట్రంలో ఆరోగ్యం వెల్లివిరుస్తోందన్నారు. తమ ప్రభుత్వం మానవీయ కోణంలో ఆరోగ్య సేవలను క్షేత్రస్థాయికి తీసుకెళ్తోందని, ఖర్చులకు వెనకాడకుండా మెరుగైన వైద్యాన్ని ఉచితంగా అందిస్తోందని సీఎం చెప్పారు. అమ్మఒడిలాంటి పథకం దేశంలో మరెక్కడా లేదన్న ఆయన ఇలాంటి పథకాల వెనక ఒక ఫిలాసఫీ ఉందన్నారు. పరిపాలనకు చేతకాదని వెక్కిరించిన వాళ్లకు మాటల్లో కాకుండా చేతల్లో అద్భుతాలు చేసి చూపిస్తున్నామన్నారు.