నా నిర్ణయంపై కాంగ్రెస్ నేతలు జోకులు వేశారు : కేసీఆర్
X
తెలంగాణ పల్లెలు పచ్చదనంతో కళకళలాడుతున్నాయని సీఎం కేసీఆర్ అన్నారు. పట్టుబట్టి ప్రారంభించిన హరితహారంతో తెలంగాణ కొద్దిగా పచ్చబడిందని చెప్పారు. తెలంగాణకు హరితహారం తొమ్మిదో విడత కార్యక్రమాన్ని కేసీఆర్ ప్రారంభించారు. తెలంగాణ దశాబ్ది వేడుకల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ హరితోత్సవం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో రంగారెడ్డి జిల్లా తుమ్మలూరు అర్బన్ ఫారెస్ట్ పార్కులో సీఎం మొక్కను నాటి తొమ్మిదో విడత హరితహారానికి శ్రీకారం చుట్టారు.
హరితహారం కార్యక్రమం మొదలుపెట్టినప్పుడు కాంగ్రెస్ నేతలు శాసన సభలో నవ్వుకున్నారని కేసీఆర్ అన్నారు. ‘‘నేను హరితహారం అంటే గతంలో నేతలు, అధికారులకు అర్థం కాలేదు. హరితహారాన్ని చాలామంది హాస్యాస్పదం చేశారు.. కాంగ్రెస్ నేతలు జోకులు వేశారు. రాష్ట్రంలో 7.7 శాతం పచ్చదనం పెరిగింది. దారులన్నీ పూలదారులుగా మారాయని ఇటీవల ఒక కవి రాశారు. పచ్చదనం పెంపు విషయంలో సర్పంచులను అభినందిస్తున్నా” అని కేసీఆర్ అన్నారు.
హరితహారం కార్యక్రమంలో 2013 నుంచి 2023 వరకు 273.33 కోట్ల మొక్కలు నాటినట్లు కేసీఆర్ చెప్పారు. ఈ కార్యక్రమం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.10,822 కోట్లు ఖర్చు చేసిందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 13,657 ఎకరాల విస్తీర్ణంలో 19,472 పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. 1,00,691 కిలోమీటర్ల మేర రాష్ట్రం అంతటా రహదారి వనాలు ఏర్పాటు చేశామన్నారు.
రాష్ట్ర ప్రజలకు పండ్ల మొక్కలను ఉచితంగా ఇవ్వాలని సీఎస్కు కేసీఆర్ సూచించారు. అదేవిధంగా రాష్ట్రంలో ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులన్నీ దాదాపు 85 శాతం పూర్తయ్యాయని తెలిపారు. గోదావరి నీళ్లను గండిపేట, హిమాయత్ సాగర్ వరకు తీసుకొస్తామని, రాబోయే కొద్ది రోజుల్లోనే చేవెళ్ల ప్రాంతానికి నీళ్లు అందిస్తామని స్పష్టం చేశారు.