Home > తెలంగాణ > CM KCR: బీఆర్ఎస్ హయాంలో రైతుల కంటి నిండా నిద్ర.. కళ్లాల నిండా వడ్లు - సీఎం కేసీఆర్

CM KCR: బీఆర్ఎస్ హయాంలో రైతుల కంటి నిండా నిద్ర.. కళ్లాల నిండా వడ్లు - సీఎం కేసీఆర్

CM KCR: బీఆర్ఎస్ హయాంలో రైతుల కంటి నిండా నిద్ర.. కళ్లాల నిండా వడ్లు - సీఎం కేసీఆర్
X

తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో నెంబర్ వన్ గా ఉండి దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని సీఎం కేసీఆర్ అన్నారు. హైదరాబాద్ తెలంగాణ భవన్ లో పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన అనంతరం హుస్నాబాద్ చేరుకున్న ఆయన ప్రజా ఆశీర్వాద సభ వేదికగా ఎన్నికల శంఖారావం పూరించారు. గత పదేండ్లలో కేంద్రం కుట్రల్ని అధిగమించి అద్భుత విజయాలు సాధించామని గుర్తు చేశారు. ఎన్నికలు రాగానే ఎవరో వచ్చి ఏదో చెప్తే నమ్మి మోసపోవద్దని.. ప్రజలు రాయేదో రత్నమేదో గుర్తించి ఓటేయాలని కేసీఆర్ చెప్పారు.

అభాగ్యులను ఆదుకునేందుకే..

అభాగ్యులను ఆదుకునే బాధ్యత ప్రభుత్వానిదేనన్న కేసీఆర్.. అందుకోసమే పెన్షన్లు ఇస్తున్నామని చెప్పారు. ఓట్ల కోసం రూ.5వేల పెన్షన్ ఇస్తమని చెప్పడంలేదని స్పష్టం చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆసరా ఫించన్లను వెయ్యి రూపాయలు పెంచుతామని ఆ తర్వాత ఏటా రూ.500 చొప్పున పెంచనున్నట్లు చెప్పారు.

తొలగిన కరెంటు కష్టాలు

రాష్ట్రం ఏర్పడినప్పుడు కరెంట్ కష్టాలు ఉండేవని ప్రస్తుతం ఆ పరిస్థితి లేదని కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్ 50 ఏండ్ల పాలనలో కరెంటు కష్టాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువేనని అన్నారు. ఆ పార్టీకి 10 - 12సార్లు అవకాశమిచ్చినా రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టిందని విమర్శించారు. పంట పండేలోపు మోటర్లు కాలిపోయేవని ధాన్యం అమ్మగా వచ్చిన పైసలన్ని వాటి రిపేర్లకే సరిపోయేవని గుర్తుచేశారు. ట్రాన్స్ ఫార్మర్లు కాలిపోతే వాటిని బాగుచేసే లోపు సగం పొలాలు ఎండిపోయేవని కానీ ఇప్పుడు రాష్ట్రమంతటా నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నామని చెప్పారు. ప్రజల సహకారంతోనే ఇదంతా సాధ్యమైందని అన్నారు.

కళ్లాల నిండా ఒడ్లు

ఎవరూ అడగకపోయినా రైతు బంధు ఇస్తున్నామని కేసీఆర్ స్పష్టం చేశారు. ఒకప్పుడు 800 అడుగుల బోర్లు వేసినా నీళ్లు పడేవి కావని, కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా నీళ్లే కనిపిస్తున్నాయని అన్నారు. రైతులు కంటినిండా నిద్ర, కళ్లాల నిండా వడ్లు ఉన్నాయని చెప్పారు. రాష్ట్రంలో ఏ గ్రామాన చూసినా ధాన్యపు రాశులే కనిపిస్తున్నాయని ముఖ్యమంత్రి సంతోషం వ్యక్తం చేశారు.

మళ్లీ సీఎంగా వస్తా

మిషన్ భగీరథ వంటి పథకం ప్రపంచంలో ఎక్కడాలేదని కేసీఆర్ అన్నారు. ఈ పథకం ద్వారానే ఐదేండ్లుగా నిరంతరాయంగా నీరు సరఫరా చేస్తున్నామని చెప్పారు. ఆడబిడ్డ బిందె పట్టుకుని కనిపించే పరిస్థితి లేకుండా చేశామని అన్నారు. ఎన్నికలు పూర్తయ్యాక ఐదారు నెలల్లోనే మళ్లీ వచ్చి సీఎం హోదాలో గౌరవెల్లి ప్రాజెక్టు ప్రారంభిస్తానని హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ కార్యకర్తలు పార్టీ మేనిఫెస్టోను గ్రామగ్రామానా ప్రజలకు వివరించాలని పిలుపునిచ్చారు. ఈసారి 95 నుంచి 100 సీట్లు గెలిచి అద్భుత విజయాన్ని సాధించాలని కేసీఆర్ ఆకాంక్షించారు.

Updated : 15 Oct 2023 6:02 PM IST
Tags:    
Next Story
Share it
Top