Home > తెలంగాణ > కేసీఆర్ కేబినెట్లోకి పట్నం.. కేసీఆర్ స్కెచ్ మామూలుగా లేదుగా..?

కేసీఆర్ కేబినెట్లోకి పట్నం.. కేసీఆర్ స్కెచ్ మామూలుగా లేదుగా..?

కేసీఆర్ కేబినెట్లోకి పట్నం.. కేసీఆర్ స్కెచ్ మామూలుగా లేదుగా..?
X

రంగారెడ్డి జిల్లాలో ఓ పాత సామెతుంది. పట్నం, పటోళ్లను కాదని జిల్లాలో ఎవరూ రాజకీయం చేయలేరని. ఇప్పుడది మరోసారి నిజమైంది. తాండూరు ఎమ్మెల్యే టికెట్ ఆశించిన మాజీ మంత్రి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డికి మొండిచేయి చూపిన కేసీఆర్.. ఏకంగా మంత్రి పదవి కట్టబెట్టేందుకు సిద్ధమయ్యారు. బీఆర్ఎస్ను ఆయన వదిలి వెళ్లరని తెలిసినా కేసీఆర్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. అయితే దీని వెనుక పెద్ద ప్లాన్ ఉందన్నది రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట.

పైలెట్ వర్సెస్ పట్నం

1994, 1999, 2009లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన మహేందర్ రెడ్డి రాష్ట్ర విభజన తర్వాత బీఆర్ఎస్‌ పార్టీలో చేరారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగోసారి తాండూరు ఎమ్మెల్యేగా విజయం సాధించి తెలంగాణ తొలి ప్రభుత్వంలో రవాణా శాఖ మంత్రిగా పనిచేశారు. అయితే 2018 ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి పైలట్‌ రోహిత్‌ రెడ్డి చేతిలో మహేందర్‌రెడ్డి ఓటమిపాలయ్యారు. దీంతో బీఆర్ఎస్ ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చింది. తదనంతర పరిణామాల్లో భాగంగా రోహిత్ రెడ్డి బీఆర్ఎస్లో చేరారు. దీంతో తాండూరులో పరిస్థితి పైలెట్ వర్సెస్ పట్నం అన్నట్లు మారింది. తాజాగా తాండూరు టికెట్ మరోసారి రోహిత్ రెడ్డికి ఇవ్వనున్నారన్న వార్తల నేపథ్యంలో పట్నం బీఆర్ఎస్కు గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరడం ఖాయమన్న పుకార్లు షికారు చేశాయి. ఈ క్రమంలో సోమవారం పార్టీ అభ్యర్థుల్ని ప్రకటించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పట్నం మహేందర్ రెడ్డికి బంపరాఫర్ ఇచ్చారు. ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోయినా మంత్రి పదవి కట్టబెట్టేందుకు రెడీ అయ్యారు.

ప్రజా సమస్యలపై చిత్తశుద్ధి

పట్నం మహేందర్ రెడ్డి కాంగ్రెస్ టచ్లోకి వెళ్లినట్లు కేసీఆర్కు సమాచారం ఉంది. నిజానికి ఇతర పార్టీల్లోకి వెళ్లే వారి గురించి ఆయన పట్టించుకోరు. అయితే మహేందర్ రెడ్డికి ఉన్న ఛరిష్మా గురించి తెలిసిన కేసీఆర్.. ఎన్నికలకు ఒకట్రెండు నెలల ముందు ఆయనకు మంత్రి పదవి ఇస్తుండటం చర్చనీయాంశంగా మారింది. నిజానికి పట్నం మహేందర్ రెడ్డికి తాండూరుతో పాటు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా రాజకీయాలపై గట్టి పట్టుంది. ఆయన భార్య సునీతా రెడ్డి ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్గా ఉన్నారు. ఆయన సోదరుడు పట్నం నరేందర్ రెడ్డి 2018లో కొడంగల్‌ ఎమ్మెల్యేగా గెలిచారు. పట్నం మహేందర్ రెడ్డి దంపతులిద్దరు ప్రజా సమస్యలపై చిత్తశుద్ధితో పనిచేస్తారన్న పేరుంది. నిత్యం ప్రజాక్షేత్రంలో ఉండి జనంతో మమేకమవుతుండటం వారికి ప్లస్ పాయింట్.

సర్వే రిపోర్టులో

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నియోజకవర్గాలవారీగా చేయించిన సర్వే రిపోర్టులో పట్నంకు మంచి మార్కులే వచ్చాయట. ఒకవేళ ఆయన కాంగ్రెస్లో చేరితే జనమంతా ఆయనకే జై కొడతారని సర్వే రిపోర్టులు తేల్చిచెప్పాయి. ఇలాంటి పరిస్థితుల్లో చివరి క్షణంలో మహేందర్ రెడ్డి కాంగ్రెస్‌లోకి జంప్ అయితే కేసీఆర్కు గట్టి దెబ్బ తగులుతుంది. పట్నం పార్టీ మారితే ఆయన భార్య బీఆర్ఎస్కు గుడ్ బై చెప్పే ఛాన్సుంది. అందుకే కేసీఆర్ మంత్రి పదవి ఇచ్చే మాస్టర్ ప్లాన్ వేశారని రాజకీయవర్గాల్లో చర్చ నడుస్తోంది.

టికెట్ ఇవ్వలేని పరిస్థితి

తాండూరులో పరిస్థితి అంతా పట్నం మహేందర్ రెడ్డికి సానుకూలంగా ఉన్నా కేసీఆర్ మాత్రం ఆయకు టికెట్ ఇవ్వలేదు. అందుకు కారణం పైలెట్ రోహిత్ రెడ్డి. 2018లో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన పైలెట్ ఆ తర్వాత బీఆర్ఎస్లో చేరారు. ఫాం హౌస్ కేసులో కీలకంగా వ్యవహరించిన ఆయన.. బీజేపీ బేరసారాలను బయటపెట్టాడు. దీంతో కేసీఆర్కు రోహిత్ రెడ్డిపై గురి కుదిరింది. ఆ కారణంతోనే ఫాం హౌస్ కేసులో ఏం జరిగినా పైలెట్కు అండగా నిలబడాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారు. బీజేపీ కేసులు పెట్టి వేధించినా పార్టీపరంగానే కాకుండా వ్యక్తిగతంగానూ తోడుంటానని పైలెట్కు హామీ ఇచ్చారు. ఇదే సమయంలో కేసీఆర్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రోహిత్ రెడ్డికి తాండూరు టికెట్ కన్ఫామ్ చేశారు. తాజాగా ఈ విషయాన్ని పట్నం దంపతుల వద్ద ప్రస్తావించిన కేసీఆర్ టికెట్ ఎందుకు ఇవ్వలేకపోతున్నారో వివరించినట్లు సమాచారం.

పదవి ఇచ్చినా

అసెంబ్లీ ఎన్నికలకు మరికొన్ని నెలల సమయం మాత్రమే ఉంది. ఒకవేళ వచ్చే నెలలో నోటిఫికేషన్ వెలువడితే ఆ వెంటనే ఎలక్షన్ కోడ్ అమల్లోకి వస్తుంది. అప్పుడు మంత్రులుగా ఉన్నా చేసేదేమీ ఉండదు. ఇలాంటి పరిస్థితుల్లో ఓ నెల రోజుల కోసం పట్నంను కేసీఆర్ మంత్రి వర్గంలోకి తీసుకోవడం వెనుక చాలా కారణాలే ఉన్నాయి. పట్నం మహేందర్ రెడ్డి పార్టీ మారకుండా కట్టడి చేయడం ఒకటైతే బీఆర్ఎస్లో ఆయన ప్రాధాన్యం తగ్గలేదని అనుచరులకు నమ్మకం కలిగించడం మరొకటి. అంతేకాదు మహేందర్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తే ఆయన కేడర్ పైలెట్ రోహిత్ రెడ్డి గెలుపు కోసం పనిచేస్తుంది. ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని సీఎం పట్నం మహేందర్ రెడ్డికి కేబినెట్ బెర్త్ ఆఫర్ చేసినట్లు బీఆర్ఎస్ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

మళ్లీ పదవి కష్టమేనా..?

ఇదిలా ఉంటే పట్నం మహేందర్ రెడ్డికి బంధువైన సబితా ఇంద్రారెడ్డి ఇప్పటికే కేబినెట్ లో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికల అనంతరం బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తే ఇద్దరినీ మంత్రి మండలిలో కొనసాగిస్తారా అన్న ప్రశ్న తలెత్తుతోంది. ఒకే సామాజిక వర్గం కావడం, ఇద్దరూ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన వారే కావడంతో వ్యతిరేకత ఎదురయ్యే అవకాశముంది. ఈ క్రమంలో ఎన్నికల అనంతరం కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.


Updated : 22 Aug 2023 8:28 AM GMT
Tags:    
Next Story
Share it
Top