crop loan waiver process: రైతన్నా.. ఇక నో వర్రీ.. 'లక్ష' మాఫీ
X
నేటి నుంచి తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా రుణమాఫీ ప్రక్రియ ప్రారంభం కానుంది. 2018 ఎన్నికల సందర్భంగా రూ.లక్ష లోపు రైతు రుణాలను మాఫీ చేస్తామని సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు ఈ రుణమాఫీ జరుగనుంది. రైతుబంధు తరహాలో విడతల వారీగా రుణమాఫీ చేయాలని, సెప్టెంబర్ రెండో వారంలోగా ఈ ప్రక్రియ పూర్తి కావాలని సీఎం.. నిన్న(బుధవారం) ప్రగతి భవన్‌లో జరిగిన సమీక్షలో తెలిపారు. ఇన్నాళ్లూ కరోనా లాంటి ఉపద్రవంతో పాటు, కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించడంతో.. ఆర్థిక వెసులుబాటు లేక రుణమాఫీ పూర్తి స్థాయిలో అమలు చేయలేదన్నారు. ఆర్థిక పరిస్థితి కుదుట పడినందున ఇక ఈ ప్రక్రియను పూర్తి చేయదలిచామన్నారు.
గత 2014లో మొదటి విడుతలో రైతులు తీసుకున్న రుణాలన్నింటినీ సీఎం కేసీఆర్ మాఫీ చేశారు. ఈ క్రమంలో 2018 లోనూ రైతులు రూ.లక్షలోపు రుణాలను తీసుకొన్నారు. అయితే ఐదేళ్లు గడుస్తున్నా.. ఆ రుణాలను తీర్చకపోవడంతో బ్యాంకర్లు.. రైతులకు వచ్చే రైతుబంధు డబ్బులను జమచేసుకునే చర్యలకు పాల్పడ్డారు. ఈ విషయం తెలిసి ప్రభుత్వం మందలించింది. ఈ క్రమంలో 2018 డిసెంబర్ 11 నాటికి రూ.లక్షలోపు వరకు ఉన్న రుణాలను మాఫీ చేసేందుకు ప్రభుత్వం 2020లో ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో రూ.25 వేలలోపు వరకు రుణాలు మాఫీ కాగా.. రూ.25 వేల నుంచి రూ.లక్షలోపు వరకు రుణాలున్న రైతులకు గురువారం నుంచి మాఫీ కానున్నది. ఈ మాఫీతో రుణం తీరనున్నది.
కేంద్ర ప్రభుత్వం నోట్ల రద్దు చేయడం.. ఎఫ్ఆర్బీఎం నిధులను విడుదల చేయకుండా తెలంగాణ పట్ల అనుసరించిన కక్షపూరిత చర్యలు... తదితర కారణాల వల్ల ఆర్థిక లోటుతో ఇన్నాళ్లూ కొంత ఆలస్యమైందని కేసీఆర్ తెలిపారు. తిరిగి తెలంగాణ ఆర్థిక పరిస్థితి చక్కదిద్దుకున్ననేపథ్యంలో... రాష్ట్రంలో రైతు రుణ మాఫీ కార్యక్రమాన్ని పునః ప్రారంభించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రగతి భవన్‌లో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో చర్చించారు.