50 ఏండ్లు పాలించినా కాంగ్రెస్ ఫ్లోరైడ్ సమస్య పరిష్కరించలేదు - కేసీఆర్
X
పూటకో పార్టీ మారే వాళ్లకు సిద్ధాంతాలు ఉండవని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. డబ్బు మదంతో పనిచేసే వాళ్లకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. మునుగోడులో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న ఆయన.. ప్రతిపక్షాల వైఖరిని కడిగిపారేశారు. మునుగోడు ఉప ఎన్నిక సమయంలో నియోజకవర్గానికి ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తున్నామని కేసీఆర్ స్పష్టం చేశారు. 50ఏండ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ ఫ్లోరైడ్ సమస్యను పరిష్కరించలేదని మండిపడ్డారు.
రాజకీయాల్లో పనికిమాలిన వాళ్లకు బుద్ధిచెప్పాలన్న కేసీఆర్.. ఎన్నికలు వచ్చాయని ఆదరాబాదరా హామీలిచ్చే వారిని నమ్మొద్దని సూచించారు. తెలంగాణ కోసం గొంతు ఎత్తింది ఎవరో.. ఉద్యమ కాలంలో నేతల కాళ్ల దగ్గర కూర్చున్నది ఎవరో గుర్తు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రధాని మోడీ సొంత రాష్ట్రం గుజరాత్‌లో కూడా 24 గంటల విద్యుత్ ఇవ్వడం లేదని, కర్నాటకలో కరెంటు కోసం రైతులు రోడ్డెక్కుతున్నారని అన్నారు.
తెలంగాణలో 3కోట్ల టన్నుల వరి పండుతోందని, మళ్లీ అధికారంలో రాగానే రాష్ట్రంలో రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం ఇస్తామని హామీ ఇచ్చారు. పాలమూరు - రంగారెడ్డి పూర్తైతే శివన్నగూడెం ప్రాజెక్టుకు నీళ్లు ఇస్తామని, మునుగోడు నియోజకవర్గంలో 2లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని చెప్పారు. మునుగోడు ప్రజలు ఉప ఎన్నికలో చూపిన చైతన్యాన్ని వచ్చే ఎన్నికల్లోనూ చూపాలని కేసీఆర్ పిలుపునిచ్చారు.