Home > తెలంగాణ > గాంధీ స్ఫూర్తితో తెలంగాణను సాధించినం : కేసీఆర్

గాంధీ స్ఫూర్తితో తెలంగాణను సాధించినం : కేసీఆర్

గాంధీ స్ఫూర్తితో తెలంగాణను సాధించినం : కేసీఆర్
X

విభిన్న సంస్కృతుల కలయిక అయిన భారతదేశాన్ని ఒక్కతాటి మీద నిలబెట్టింది స్వాతంత్ర సమరం అని సీఎం కేసీఆర్ అన్నారు. భారతదేశం ఉన్నతమైన నాగరికతకు, సాంప్రదాయాలకు పుట్టినిల్లు అని చెప్పారు. ప్రాచీనకాలంలోనే యావత్ ప్రపంచానికి మార్గదర్శిగా నిలిచిన ఘనత మన దేశానికే దక్కుతుందన్నారు. హైద‌రాబాద్‌లోని హెచ్ఐసీసీలో నిర్వ‌హించిన స్వాతంత్య్ర వ‌జ్రోత్స‌వాల ముగింపు వేడుక‌ల్లో సీఎం పాల్గొన్నారు.

ప్రపంచ మానవాళిని అత్యధికంగా ప్రభావితం చేసిన గొప్ప నాయకుల్లో మహాత్మా గాంధీ ప్రథమ స్థానంలో ఉంటారని కేసీఆర్ అన్నారు. మత సామరస్యం కోసం పోరాడిన గాంధీజీ చివరికి మతోన్మాద శక్తుల చేతుల్లోనే హత్యకు గురికావడం చారిత్రిక విషాదం అని వ్యాఖ్యానించారు. గాంధీజీ ఒక్క భారతదేశం మీదనే కాదు, యావత్ ప్రపంచం మీద గొప్ప ముద్ర వేశారని కేసీఆర్ తెలిపారు. మార్టిన్ లూథర్ కింగ్ నుంచి, నెల్సన్ మండేలా వరకు నల్లజాతి ప్రజల పోరాటాలకు గాంధేయవాదమే ఆదర్శంగా నిలిచింది.


ప్రాణాన్ని పణంగా పెట్టైనా..



గాంధీ మార్గంలో, రాజ్యాంగ పరిధిలో ఉద్యమించడం వల్లనే తెలంగాణ రాష్ట్ర స్వప్నం సాకారమైందని కేసీఆర్ అన్నారు. ‘‘ప్రాణాన్ని పణంగా పెట్టైనా సరే లక్ష్యాన్ని సాధించాలి తప్ప, అహింసా మార్గాన్ని వీడకూడదని నేను నిర్ణయించుకున్నాను. ఆ నేపథ్యంలోంచి వచ్చిందే ఆమరణ నిరాహార దీక్ష ఆలోచన అని కేసీఆర్ వివ‌రించారు. మనది న్యాయపథం.. మనది ధర్మపథం..సకలజనుల సంక్షేమమే మనకు సమ్మతం. జాతి నిర్మాణంలో తెలంగాణను అగ్రభాగంలో నిలుపుదాం’’ అని కేసీఆర్ అన్నారు.

స‌మానంగా ప్ర‌గ‌తి ఫ‌లాలు..

స‌క‌ల జ‌నుల‌కు స‌మానంగా ప్ర‌గ‌తి ఫ‌లాలు పంచడం ద్వారానే స్వాతంత్య్రోద్యమ ఆశయాలను పరిపూర్తి చేసుకోగలుగుతామని కేసీఆర్ అన్నారు. సంక్షేమానికి అగ్రతాంబూలమివ్వడంలోనూ, రైతు కేంద్రంగా ప్రణాళికల రచన చేయడంలోనూ, గ్రామీణ అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం వెనుక గాంధీ ప్రభావమే ఉందని కేసీఆర్ తెలిపారు. భారతదేశం ఆత్మ గ్రామాల్లోనే ఉందని గాంధీ పదే పదే చెప్పారని.. ఆ మాటల ప్రేరణతోనే గ్రామీణ జీవన ప్రమాణాలను అభివృద్ధి చేసుకుంటున్నట్లు చెప్పారు. రైతు బంధు వంటి పథకాలతో రైతన్నల కళ్ళలో వెలుగులు చూస్తున్నామన్నారు. సమీకృత, సమ్మిళిత, సమగ్ర అభివృద్ధి నమూనాతో పురోగమిస్తున్నామని స్పష్టం చేశారు.


Updated : 1 Sep 2023 1:38 PM GMT
Tags:    
Next Story
Share it
Top