Home > తెలంగాణ > కేసీఆర్ బ్రహ్మాస్త్రం.. స్కెచ్ మామూలుగా లేదుగా..?

కేసీఆర్ బ్రహ్మాస్త్రం.. స్కెచ్ మామూలుగా లేదుగా..?

కేసీఆర్ బ్రహ్మాస్త్రం.. స్కెచ్ మామూలుగా లేదుగా..?
X

అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో అన్ని పార్టీలు గెలుపు కోసం ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ఓటర్లను ఆకట్టుకునేందుకు వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. ఈ విషయంలో కాంగ్రెస్ ఒకడుగు ముందుకేసింది. అన్ని వర్గాలను ఆకట్టుకునేలా హామీలు ఇస్తూ ముందుకు సాగుతోంది. అయితే హ్యాట్రిక్పై కన్నేసిన కేసీఆర్.. కాంగ్రెస్ కు చెక్ పెట్టేందుకు ఒక్కో బ్రహ్మాస్త్రాలను బయటకు తీయనున్నట్లు సమాచారం.

కాంగ్రెస్ గ్రాఫ్ పెరగకుండా స్కెచ్

కాంగ్రెస్ పార్టీ తాము అధికారంలోకి వస్తే రూ.2లక్షల వరకు రైతు రుణమాఫీ, రూ.500కే ఎల్పీజీ సిలిండర్, నిరుద్యోగ భృతి, ఆసరా పింఛన్ పెంపు, ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చింది. సెప్టెంబర్ 17న ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతోంది. అయితే కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెరగకుండా కేసీఆర్ మాస్టర్ స్ట్రోక్ ఇచ్చేందుకు రెడీగా ఉన్నట్లు బీఆర్ఎస్ సర్కిళ్లలో టాక్ వినిపిస్తోంది. ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ గెలిచాక అమలు చేస్తామంటున్న హామీలను కేసీఆర్ ఎన్నికలకు ముందే ఇంప్లిమెంట్ చేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం.

రుణమాఫీ అమలు

కేసీఆర్ తన ప్లాన్లో భాగంగా కాంగ్రెస్ ఇచ్చిన హామీల్లో ఒకటైన రైతు రుణమాఫీపై దృష్టి పెట్టారు. ఇప్పటికే ఈ ప్రక్రియ మొదలుపెట్టారు. 2018 డిసెంబర్కు ముందు తీసుకున్న రుణంలో లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేస్తోంది. మరోవైపు కాంగ్రెస్ తాము అధికారంలోకి వస్తే రూ.4వేలు ఆసరా పింఛన్ ఇస్తామని చెప్పింది. దీంతో కేసీఆర్ సర్కారు సైతం పెన్షన్ మొత్తాన్ని డబుల్ చేయాలని నిర్ణయించినట్లు బీఆర్ఎస్ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

ఫించన్ డబుల్?

తెలంగాణ ప్రభుత్వం 2014, అక్టోబర్ 1న ఆసరా పింఛను పథకం ప్రారంభించింది. 2018 ముందస్తు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు రూ.1000గా ఉన్న ఆసరా పింఛన్ ను ప్రభుత్వం రూ.2016 చేసింది. దివ్యాంగులకు ఇచ్చే రూ.1500 పెన్షన్ ను రూ.3016 చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో 43,68,784 మంది ఆసరా పింఛన్ లబ్దిదారులు ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం కేటగిరీలవారీగా మొత్తం 10 రకాల ఆసరా పెన్షన్లు ఇస్తోంది. దివ్యాంగులకు ఇచ్చే రూ.3016 పింఛన్ ను ఇప్పటికే రూ.4.016కు పెంచిన కేసీఆర్ సర్కారు వృద్ధులు, వితంతువులు, చేనేత కార్మికులు, కల్లు గీత కార్మికులు, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు, హెచ్ఐవీ, బోదకాల బాధితులు, కళాకారులకు ప్రస్తుతం ఇస్తున్న రూ.2016 పెన్షన్ ను రూ.4016కు పెంచాలని నిర్ణయించినట్లు సమాచారం.

నిరుద్యోగ భృతిపై అనుమానం

అసెంబ్లీ ఎన్నికల అనంతరం అధికారంలోకి వస్తే కాంగ్రెస్ నిరుద్యోగులందరికీ నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రకటించింది. ఉద్యోగం లేని యువతకు ప్రతి నెల రూ.4వేల చొప్పున బ్యాంకు ఖాతాలో వేస్తామని చెప్పింది. ఈ క్రమంలో కాంగ్రెస్ ఇచ్చిన నిరుద్యోగ భృతి హామీ అమలుపైనా బీఆర్ఎస్ వర్గాల్లో చర్చ నడుస్తున్నట్లు సమాచారం. కొందరు ఎమ్మెల్యేలు ఈ పథకం అమలు చేస్తే కలిసొస్తుందని చెబుతున్నా కేసీఆర్ మాత్రం అంతగా ఆసక్తిచూపడంలేదని సమాచారం. సీఎం కేసీఆర్ పాలనపై యువత తీవ్ర అసంతృప్తితో ఉన్నందున అది వర్కౌట్ కాకపోవచ్చని సీఎం కేసీఆర్ అభిప్రాయంగా తెలుస్తోంది. ఇలా కాంగ్రెస్కు ఎలాంటి అవకాశమివ్వకుండా ఎన్నికల నోటిఫికేషన్ వెలువడేలోపు వీలైనన్ని అస్త్రాలను బయటకు తీసేందుకు సీఎం సిద్ధమవుతున్నట్లు బీఆర్ఎస్ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

Updated : 9 Aug 2023 9:16 AM GMT
Tags:    
Next Story
Share it
Top