అల్లూరి జయంతి ఉత్సవాల సందర్భంగా..శ్రీశ్రీ పాటను గుర్తుచేసుకున్న కేసీఆర్
X
బ్రిటీష్ బానిస సంకెళ్లనుంచి భారత మాత విముక్తి కోసం పోరాడిన మహావీరుడు అల్లూరి సీతారామరాజు అని సీఎం కేసీఆర్ అన్నారు. మన్యం బిడ్డల కన్నీరు తుడిచి.. గడ్డపరకను గడ్డపారలా మార్చిన యోధుడు అల్లూరి అని కేసీఆర్ కొనియాడారు. స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు 125 జయంతి ఉత్సవాల సందర్భంగా గచ్చిబౌలిలో క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించి కార్యక్రమంలో మాట్లాడిన కేసీఆర్.. అల్లూరి గొప్పతనాన్ని, చరిత్రను ముందు తరాలకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, తెలంగాణ గవర్నర్ తమిళసై పాల్గొన్నారు. అల్లూరి సీతారామరాజుని దైవాంశ సంభూతుడిగా భావిస్తానని.. భగత్ సింగ్, ఆజాద్ చంద్రశేఖర్ లాంటి యోధుల సరసన.. తెలుగు జాతిని నిలబెట్టిన ఘనుడు అల్లూరి అని కేసీఆర్ కొనియాడారు. ఈ సందర్భంగా శ్రీ శ్రీ పాటను గుర్తుచేసుకున్నారు కేసీఆర్. తెలంగాణ ఉద్యమ సమయంలో ‘తెల్లవారి గుండెల్లో నిదురించిన వాడా’ అనే పాటను ఎక్కువగా వినేవాడినని, ఆ పాట తనలో పౌరుషాన్ని రగిలించిందని అన్నారు. ఎక్కడైతే సామాన్య ప్రజలపై దౌర్జన్యం, దోపిడి జరుగుతుందో.. అక్కడ అల్లూరిలు పుట్టుకొస్తారని, అన్యాయాన్ని అనిచివేస్తారని అన్నారు.