కొల్లాపూర్పై వరాల జల్లు.. నియోజకవర్గానికి సీఎం ఏం ఇచ్చారంటే..
X
కొల్లాపూర్ నియోజకవర్గంపై సీఎం కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. కొల్లాపూర్ పట్టణ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి ప్రత్యేక నిధి నుంచి రూ. 25 కోట్ల నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. కొల్లాపూర్‌లో ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కొల్లాపూర్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామ పంచాయతీకి 15 లక్షల చొప్పున మంజూరు చేయడంతో పాటు మహబూబ్‌నగర్ పట్టణానికి జేఎన్‌టీయూ ఇంజనీరింగ్ కాలేజీ మంజూరు చేయించనున్నట్లు కేసీఆర్ స్పష్టం చేశారు.
జీల్‌దార్ తిప్ప లిఫ్ట్, బాచారం హైలెవల్ కెనాల్, పసుపుల బ్రాంచి కెనాల్ వైడెనింగ్, మల్లేశ్వరం మినీ లిఫ్ట్‌లను వెంటనే సర్వే చేయించి మంజూరు చేస్తామని కేసీఆర్ చెప్పారు. బోడకట్టు చెక్ డ్యామ్ కోసం ఆదివారమే జీవో ఇస్తానని హామీ ఇచ్చారు.
బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక పాలమూరు బిడ్డల జీవన చిత్రం మారిపోయిందని సీఎం కేసీఆర్ అన్నారు. ఒకప్పుడు పాలమూరు బిడ్డ హైదరాబాద్‌లో అడ్డా కూలీగా పనిచేస్తే ఈ రోజు పొరుగు రాష్ట్రాల నుంచి కూలీలు మహబూబ్ నగర్కు వస్తున్నారని చెప్పారు. సొంత ఊరిలోనే పని దొరుకుతుండటంతో స్థానికుల వలసలు ఆగిపోయాయని అన్నారు. ఒకప్పుడు పొట్టకూటి కోసం వలసపోయిన రైతులు ఇప్పుడు పొలం పనులు చేసుకుంటుండటం సంతోషంగా ఉందన్నారు.