పాలమూరును వలసల జిల్లాగా మార్చిన పార్టీ కాంగ్రెస్ - సీఎం కేసీఆర్
X
పాలమూరు జిల్లాను గత పాలకులు దత్తత తీసుకున్నారే తప్ప గుక్కెడు నీళ్లు తేలేదని సీఎం కేసీఆర్ అన్నారు. దేవరకద్రలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న ఆయన.. కాంగ్రెస్ పార్టీపై ఫైర్ అయ్యారు. వలసలు పోయి బాధలుపడ్డ పాలమూరు జిల్లాను గత సీఎంలు ఎవరూ పట్టించుకోలేదని విమర్శించారు. కరువు కారణంగా జిల్లాలో గంజి, అంబలి కేంద్రాలు పెట్టే గతి పట్టించారని కేసీఆర్ మండిపడ్డారు. మహబూబ్ నగర్ జిల్లాను 40- 50 ఏండ్లు వలస గతి పట్టించిన పార్టీ కాంగ్రెస్ అని గుర్తు చేశారు.
తెలంగాణ ప్రాంతాన్ని ఏపీలో కలపకపోతే బాగుండేదని బచావత్ ట్రైబ్యునల్ స్వయంగా చెప్పిందని కేసీఆర్ అన్నారు. జూరాల ప్రాజెక్టు మంజూరు చేసినా అంజయ్య సీఎం అయ్యే వరకు శంకుస్థాపన చేయలేదని గుర్తు చేశారు. పాలమూరును సర్వనాశనం చేసిన పార్టీ కాంగ్రెస్ అన్న కేసీఆర్.. 2004లో ప్రత్యేక తెలంగాణ ఇస్తామని మాట ఇచ్చి తప్పిందని అన్నారు. ఉద్యమాన్ని పెడదారి పట్టించే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోవడంతో గత్యంతరం లేక 14 ఏండ్ల తర్వాత ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిందని కేసీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత పదేండ్లలో పాలమూరు ఎంత అభివృద్ధి చెందిందో అందరికీ తెలుసని అందుకే అభ్యర్థులతో పాటు వారి పార్టీ చరిత్రను చూసి ఓటు వేయాలని కేసీఆర్ పిలుపునిచ్చారు.