Home > తెలంగాణ > కాంగ్రెస్ పదేండ్లు ఏడిపించి.. గత్యంతరం లేక రాష్ట్రం ఇచ్చింది - కేసీఆర్

కాంగ్రెస్ పదేండ్లు ఏడిపించి.. గత్యంతరం లేక రాష్ట్రం ఇచ్చింది - కేసీఆర్

కాంగ్రెస్ పదేండ్లు ఏడిపించి.. గత్యంతరం లేక రాష్ట్రం ఇచ్చింది - కేసీఆర్
X

ఎన్నికలు రాగానే ప్రజలు ఆగం కావద్దని సీఎం కేసీఆర్ అన్నారు. అచ్చంపేట ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న ఆయన.. ఎన్నికల్లో ప్రజలు గెలిచే పరిస్థితి రావాలని ఆకాంక్షించారు. అప్పుడే అందరి బతుకులు బాగుపడతాయని చెప్పారు. తెలంగాణ కోసం బయల్దేరి 24 ఏండ్లు అయిందన్న కేసీఆర్ అప్పుడు ఎవరూ వెంటలేరన్న విషయాన్ని గుర్తు చేశారు. ఈ రోజు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్న వారంతా ఎక్కడున్నారో జనానికి తెలుసు అని అన్నారు. ఉన్న తెలంగాణను ఊడగొట్టిన కాంగ్రెస్ ఎన్నో వందల మంది ఉసురు పోసుకున్నదని కేసీఆర్ విమర్శించారు. పదేండ్లు ఏడిపించి, 32 పార్టీల మద్దతు కూడగట్టి, చావు నోట్లో తలపెడితేనే స్వరాష్ట్రం ఇచ్చిందని మండిపడ్డారు. ఇప్పుడు కూడా వారికి ప్రజల బాగోగులు అవసరం లేదని, కేవలం తెలంగాణపై పెత్తనం కోసమే ఆరాటపడుతున్నారని కేసీఆర్ మండిపడ్డారు.

ఒకప్పుడు పాలమూరులో గంజి, అంబలి కేంద్రాలు ఉండేవని, ఆడబిడ్డలు నీటి కోసం 5 కిలోమీటర్ల నడవాల్సిన పరిస్థితి ఉండేదని కేసీఆర్ గుర్తు చేశారు. ఒకప్పుడు దుందుబి నదిలో దుమ్ము లేస్తే ఇప్పుడు నిండు కుండలా మారిందని అన్నారు. అర్థరాత్రి కరెంటు కోసం పోయి విష పురుగుల బారిన పడి ప్రాణాలు పోయేవని కేసీఆర్ గుర్తు చేశారు. ఉపాధి లేక జనం బొంబాయి వలస వెళ్లినప్పుడు ఇప్పుడు మాట్లాడుతున్నా వాళ్లలో ఎవరైనా ఉన్నారా అని ప్రశ్నించారు. ఎన్నికప్పుడు బహురూపులోళ్లలెక్క వచ్చి ఏది పడితే అది చెప్తారని, ఆ తర్వాత కనిపించకుండా పోతారని కేసీఆర్ మండిపడ్డారు.

తెలంగాణను కాపాడుకునేందుకు తాను వచ్చానని కేసీఆర్ అన్నారు. తన పోరాటం అయిపోయిందని, ఇప్పుడు రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు జనం వంతు వచ్చిందని అన్నారు.పదేళ్ల క్రితం తెలంగాణ ఎలా ఉండేదో ప్రజలు గుర్తుచేసుకోవాలని అన్నారు. సరిపడా కరెంటు లేక తాగు, సాగునీటి కోసం ఎన్నో కష్టాలు పడ్డామని ఇప్పుడు దేశంలోనే 24 గంటల కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని చెప్పారు. దేశానికే దిక్సూచిగా నిలిచేలా తెలంగాణ ఎదిగిందని కేసీఆర్ స్పష్టం చేశారు.



Updated : 26 Oct 2023 4:48 PM IST
Tags:    
Next Story
Share it
Top