ఉండాలా, తీసేయాలా మీరే చెప్పండి : కేసీఆర్
X
మరో పది, పదిహేనేళ్లు ఇలాగే కష్టపడితే తెలంగాణ రాష్ట్రానికి అభివృద్ధిలో తిరుగు ఉండదని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. కొందరు ప్రభుత్వంపై నిరాధారణ ఆరోపణలు చేస్తున్నారని విపక్షాలపై మండపడ్డారు. ప్రభుత్వ పనితీరు బావుందో లేదో తీర్పు చెప్పాల్సింది ప్రజలేనని అన్నారు. ఆయన సోమవారం గద్వాలలో కొత్త కలెక్టర్ కార్యాలయాన్ని, కొత్త ఎస్పీ కార్యాలయాన్ని ప్రారంభించి ప్రసంగించారు. సంక్షేమ పథకాల్లో రాష్ట్రంలో దేశంలోనే నంబర్ వన్ స్థానంలో ఉందన్నారు. హరిత విప్లవం సాధించిన పంజాబ్‌ను కూడా మించినపోయిన తెలంగాణ దేశానికే అన్నపూర్ణగా మారిందన్నారు.
సమస్యలన్నీ తీరాయి..
తెలంగాణ తమ ప్రభుత్వ కృషితో ఎన్నో సమస్యల నుంచి గట్టెక్కిందని కేసీఆర్ అన్నారు. ‘‘గద్వాల జిల్లా ఎంతో అభివృద్ధి చెందుతోంది. పాలమూరులో వలసలు తగ్గాయి. వేరే ప్రాంతాల నుంచి ఇప్పుడు పాలమూరుకే వల వస్తున్నారు. తెలంగాణ వస్తే కరెంటు ఉండదని, అంతా చీకటేనని భయపెట్టారు. ఇప్పుడు తెలంగాణ కరెంటులో దేశంలోనే నంబర్ వన్. మీకు 25 కిలోమీటర్ల దగ్గర్లోనే ఆంధ్రా ఉంది. అక్కడి పరిస్థితి మీరే గమనించి పోల్చిచూసుకోండి.’’ అని చెప్పారు.
ధరణి వల్లే..
ధరణి పథకాన్ని బంగాళాఖాతంలో పడేస్తామని విపక్షాలు చేస్తున్న హెచ్చరికపై కేసీఆర్ తీవ్రంగా స్పందించారు. ‘‘ధరణితోనే భూసమస్యలు పరిష్కారమవుతున్నాయి. రైతు బంధు నగదు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లో పడుతోంది. రైతు చనిపోతో రూ.5 లక్షల బీమాసొమ్ము 10 రోజల్లోనో వస్తోంది. పది నిమిషాల్లో రిజిస్ట్రేషన్ పూర్తవుతోంది మూడేళ్లు ఎంతో కష్టపడి ధరణికి రూపుతెస్తే కాంగ్రెస్ నేతలు కువిమర్శలు చేస్తున్నారు. ధరణి కావాలో, వద్దో మీ చెప్పండి’’ అని అన్నారు.