Home > తెలంగాణ > వైద్య రంగాన్ని మరింత బలోపేతం చేస్తాం - సీఎం కేసీఆర్

వైద్య రంగాన్ని మరింత బలోపేతం చేస్తాం - సీఎం కేసీఆర్

వైద్య రంగాన్ని మరింత బలోపేతం చేస్తాం - సీఎం కేసీఆర్
X

హైదరాబాద్‌ : తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆరోగ్య శాఖకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చామని సీఎం కేసీఆర్ అన్నారు. బడ్జెట్ కేటాయింపులు భారీగా పెంచామని చెప్పారు. హైదరాబాద్‌లో నిమ్స్‌ దశాబ్ది బ్లాక్‌ నిర్మాణానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ శంకుస్థాపన చేసిన అనంతరం జరిగిన సభలో కేసీఆర్ మాట్లాడారు. వైద్యానికి మానవ జీవితానికి ఎడతెగని సంబంధం ఉందని చెప్పారు. 2014లో వైద్యరంగానికి బడ్జెట్‌లో రూ.2001 కోట్లు కేటాయిస్తే.. 2023-24 నాటికి అది రూ.12,367 కోట్లకు చేరిందని ప్రకటించారు. తెలంగాణలో వైద్యరంగానికి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యానికి ఇది నిదర్శనమని చెప్పారు.

వైద్యారోగ్యానికి ప్రాధాన్యం

భవిష్యత్తులో కరోనాను మించిన వైరస్‌లు వస్తాయని నిపుణులు చెప్పిన విషయాన్ని కేసీఆర్ గుర్తు చేశారు. వైద్యరంగం బలంగా ఉంటే తక్కువ నష్టంతో బయటపడుతారని వారు చెప్పారని అన్నారు. అందుకే వైద్యరంగాన్ని రాష్ట్రంలో బలోపేతం చేస్తున్నామని ప్రకటించారు. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి వైద్యఆరోగ్యానికి ప్రాధాన్యమిస్తున్నామన్న సీఎం కేసీఆర్... పిల్లల పెరుగుదలలో సమస్యలు ఉండకూడదని న్యూట్రిషన్‌ కిట్లు అందిస్తున్నట్లు చెప్పారు. ఈ కిట్లతో ఒక తరం ఆరోగ్యకరంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు.

అద్భుతమైన హెల్త్ సిటీ

ప్రభుత్వ దవాఖానాల్లో సామర్థ్యానికి మించి రోగులు వచ్చినా డాక్టర్లు ట్రీట్మెంట్ అందిస్తున్నారని ముఖ్యమంత్రి అన్నారు. మూరుమూల ప్రాంతాల్లో పనిచేసే వైద్యులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. గతంలో దవాఖానల్లో 30 శాతం డెలివరీలు జరిగేవని, ఇప్పుడు ఆ సంఖ్య 70 శాతానికి చేరిందని అన్నారు. గతంలో ఉస్మానియా, గాంధీ, నీలోఫర్‌ తదితర దవాఖానలే దిక్కుండేవని, ఇప్పుడు వరంగల్‌లో ప్రపంచంలో లేని అద్భుతమైన హెల్త్‌ సిటీని కడుతున్నామని చెప్పారు. జనానికి కార్పొరేట్ స్థాయి వైద్యం అందించేందుకు హైదరాబాద్‌లో మరో నాలుగు హాస్పిటళ్లు కడుతున్నామని అన్నారు.


Updated : 14 Jun 2023 1:43 PM IST
Tags:    
Next Story
Share it
Top