Home > తెలంగాణ > పాలమూరు పొంగు చూసి నా ఒళ్లు పులకరించింది : కేసీఆర్

పాలమూరు పొంగు చూసి నా ఒళ్లు పులకరించింది : కేసీఆర్

పాలమూరు పొంగు చూసి నా ఒళ్లు పులకరించింది : కేసీఆర్
X

పాలమూరు ప్రాజెక్ట్తో తన జన్మ ధన్యమైందని సీఎం కేసీఆర్ అన్నారు. నాగర్‌ కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ మండలం నార్లాపూర్‌ వద్ద పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని కేసీఆర్ లాంఛనంగా ప్రారంభించి జాతికి అంకితం చేశారు. నార్లాపూర్‌ పంప్‌ హౌస్‌ వద్ద 145 మెగావాట్ల సామర్థ్యమున్న మోటర్లను ఆన్‌ చేసి ఎత్తిపోతలను ప్రారంభించారు. ఆ తర్వాత అంజనగిరి రిజర్వాయర్‌లోకి చేరిన జలాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి జలహారతి పట్టారు.

పాలమూరు పొంగు చూసి తన ఒళ్లు పులకరించిందని కేసీఆర్ అన్నారు. మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల చరిత్రలో ఇది సువర్ణధ్యాయమన్నారు. ఒకప్పుడు పాలమూరు గడ్డ అంటే హైదరాబాద్ అడ్డా మీద కూలి అని.. కానీ ఇప్పుడు పాలమూరుకే కూలీలు వలస వస్తున్నారని చెప్పారు. ఉమ్మడి పాలనలో అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు పాలమూరును దత్తత తీసుకున్నా ప్రజల గోస తీరలేదన్నారు. కానీ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక పాలమూరు పరిస్థితి మారిందని చెప్పారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 20లక్షల ఎకరాల్లో పసిడి పంటలు పండించడమే తన లక్ష్యమని కేసీఆర్ స్పష్టం చేశారు.

మహబూబ్ నగర్ ఎంపీగా తెలంగాణను సాధించానని కేసీఆర్ చెప్పారు. తెలంగాణ ఏర్పడగానే మూడు పెద్ద ప్రాజెక్టులను రూపొందించామని.. గోదావరిపై కాళేశ్వరం, సీతారామ ప్రాజెక్టులు.. కృష్ణా నదిపై పాలమూరు ప్రాజెక్ట్ చేపట్టామన్నారు. ఈ మూడు ప్రాజెక్టులు పూర్తైతే తెలంగాణ వజ్రపు తునకగా మారి దేశానికే అన్నం పెట్టే స్థాయికి ఎందుగుతుందని అన్నారు. గత పాలకులు మహబూబ్ నగర్కు ఒక్క మెడికల్ కాలేజీ తీసుకరాలేదన్నా సీఎం.. బీఆర్ఎస్ పాలనలో పాలమూరులో 5 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మహబూబ్ నగర్ కీర్తికిరీటంలో ఈ ప్రగతి శాశ్వతంగా నిలిచిపోతుందన్నారు.

వైద్య, విద్య, సాగు రంగంలో ఒక్కో మెట్టు ఎక్కుతూ ముందుకు సాగుతున్నామని సీఎం కేసీఆర్ అన్నారు. ముందు విద్యుత్ దృష్టి పెట్టి.. రాష్ట్రంలో కరెంట్ కోతలు లేకుండా చేశామన్నారు.జీడీపీలో తెలంగాణ అగ్రస్థానంలో ఉందన్నారు. ఇలా రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. ఈ అభివృద్ధి ఇలాగే కొనసాగాలంటే ప్రజలు బీఆర్ఎస్ కు అండగా ఉండాలని కోరారు. ప్రతిపక్షాల మెసపూరిత మాటలను నమ్మి ఆగం కావొద్దని సూచించారు.

Updated : 16 Sep 2023 1:50 PM GMT
Tags:    
Next Story
Share it
Top