Home > తెలంగాణ > నా ప్రాణాలు కాపాడిన వ్యక్తిని గెలిపించండి : కేసీఆర్

నా ప్రాణాలు కాపాడిన వ్యక్తిని గెలిపించండి : కేసీఆర్

నా ప్రాణాలు కాపాడిన వ్యక్తిని గెలిపించండి : కేసీఆర్
X

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్రం ఆగమవుతుందని సీఎం కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన అభివృద్ధి.. గత పదేళ్లలో జరిగిన అభివృద్ధిని గమనించాలని సూచించారు. కోరుట్లలో జరిగిన బీఆర్ఎస్ ప్రజాశీర్వాద సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. బీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల సంజయ్ తన ప్రాణాలను కాపాడిన వ్యక్తి అని చెప్పారు. ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశ్యంతో డాక్టర్ వృత్తిని వదిలి రాజకీయాల్లోకి వచ్చారని.. ఆయనకు ప్రజలు అండగా నిలవాలని కోరారు.

తలసరి ఆదాయంలో తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉందని కేసీఆర్ చెప్పారు. దేశంలో 24 గంటల కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే అని.. అటు విద్యుత్ వినియోగంలోనూ తెలంగాణ నెంబర్ వన్ స్థానంలో ఉందన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక దండగ అనుకున్న వ్యవసాయాన్ని పండుగలా మార్చామన్నారు. రైతు బంధు, రైతు బీమా, సాగునీటితో రైతుల కష్టాల్ని పరిష్కరించామని చెప్పారు. కొత్తగా నమోదైన బీడీ కార్మికులకు కూడా పెన్షన్ అందిస్తామని హామీ ఇచ్చారు.

ధరణితో పైరవీకారుల రాజ్యం పోయిందని కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణిని తీసేస్తామంటున్నారని.. ధరణిని తీసేస్తే మళ్లీ దళారుల రాజ్యం వస్తుందన్నారు. ధరణి ఉంది కాబట్టే రైతు బంధు డబ్బు నేరుగా అకౌంట్లలో జమవుతుందని వివరించారు. 50ఏళ్లు పాలించిన కాంగ్రెస్ రాష్ట్రానికి చేసిందేమిలేదని విమర్శించారు. గత ఎన్నికల వేళ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వని హామీలను కూడా నెరవేర్చామని చెప్పారు. కాబట్టి ప్రజలు ఓటేసేటప్పుడు ఆలోచించి వేయాలని సూచించారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కొనసాగాలంటే సంజయ్ని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.

Updated : 3 Nov 2023 5:36 PM IST
Tags:    
Next Story
Share it
Top