కాంగ్రెస్ మాటలకు మోసపోతే.. గోసపడతాం : కేసీఆర్
X
మెదక్లో పద్మాదేవేందర్ రెడ్డిపై కాంగ్రెస్ దిష్టిబొమ్మను తీసుకొచ్చి నిలబెట్టిందని సీఎం కేసీఆర్ అన్నారు. ఆ దిష్టిబొమ్మ గెలిస్తే.. నియోజకవర్గం అభివృద్ధిలో వెనక్కు వెళ్తుందన్నారు. మెదక్లో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజాశీర్వాద సభలో ఆయన ప్రసంగించారు. పద్మా దేవేందర్ రెడ్డి నేతృత్వంలో మెదక్ నియోజకవర్గం అన్ని విధాలా అభివృద్ధి చెందిందని అన్నారు. రామాయంపేటకు ఆర్డీవో ఆఫీసు, డిగ్రీ కాలేజీ వచ్చిందని.. అది పద్మ పవర్ అని కేసీఆర్ ప్రశంసించారు.
బీఆర్ఎస్ పాలనలో మంజీరా నది నిండుకుండలా మారిందని కేసీఆర్ అన్నారు. గతంలో మంజీరాను కాంగ్రెస్ పార్టీ ఎండబెట్టిందని విమర్శించారు. పద్మదేవేందర్ రెడ్డి ఎమ్మెల్యే అయ్యాక ఘణపూర్ ప్రాజెక్ట్ నీటితో కళకళలాడుతుందన్నారు. ఘణపూర్ ఆయకట్టు కింద 40 వేల ఎకరాలు సాగవుతుందని చెప్పారు. మెదక్ నియోజకవర్గంలోని ప్రతి ఎకరాకు నీళ్లు తెచ్చే బాధ్యత తనదని హామీ ఇచ్చారు. తెలంగాణ ప్రజలను గోసపెట్టిన కాంగ్రెస్ పార్టీ మళ్లీ కొత్త రూపంతో వస్తుందని.. మోసపోతే మళ్లీ గోసపడుతాం అని అన్నారు.
పద్మాదేవేందర్ రెడ్డి గెలిస్తే.. నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందుతుందని కేసీఆర్ అన్నారు. ఆమె గెలిస్తే రింగ్ రోడ్డు, ఇంజినీరింగ్ కాలేజీ ఆటోమేటిక్‌గా నడుచుకుంటూ వస్తాయన్నారు. బీఆర్ఎస్ సంపద పెంచుకుంటూ ప్రజలకు పంచుకుంటూ ముందుకు పోతుందన్నారు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ అభివృద్ధికి కాంగ్రెస్ చేసిందేమిలేదని విమర్శించారు. కాంగ్రెస్ తమాషాలకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ అభివృద్ధి కొనసాగాలంటే పద్మాదేవేందర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.