నాగజ్యోతి ఎమ్మెల్యే అయితే ములుగు ఓ జ్యోతిలా వెలుగుతుంది : కేసీఆర్
X
ఎమ్మెల్యే ఏ పార్టీ అయినా.. సీఎం లేదా ఉన్నతాధికారులను కలవాలని సీఎం కేసీఆర్ అన్నారు. ములుగులో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజాశీర్వాద సభలో ఆయన ప్రసంగించారు. ఎమ్మెల్యే సీతక్క నియోజకవర్గ సమస్యలపై తనను ఎప్పుడు కలవలేదని ఆరోపించారు. తమ పార్టీ నేతలు చెప్పినవిధంగా నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేశామని చెప్పారు. ములుగును జిల్లా చేసిన ఘనత తమకే దక్కుతుందని తెలిపారు.
బీఆర్‌ఎస్ అభ్యర్థి బడే నాగజ్యోతి ఎమ్మెల్యే అయితే ములుగు ఓ జ్యోతిలా వెలుగుతుందని కేసీఆర్ అన్నారు. ఆమెను గెలిపించకపోతే నియోజకవర్గ ప్రజలతో పంచాది పెట్టుకుంటానని వ్యాఖ్యానించారు. ములుగు అభివృద్ధి కావాలంటే గవర్నమెంట్‌లో ఉండే పార్టీ గెలిస్తేనే లాభం జరుగుతుందని అన్నారు. నియోజకవర్గంలో 48,161 ఎకరాల పోడు భూములకు పట్టాలిచ్చామని తెలిపారు. పట్టాలతోపాటు వారిపై ఉన్న కేసులు ఎత్తివేసి రైతుబంధు ఇచ్చినట్లు చెప్పారు. ఎన్నికల తర్వాత గిరిజనేతులకు సైతం పోడు పట్టాలిచ్చేందుకు కృషి చేస్తామని సీఎం హామీ ఇచ్చారు.
కాంగ్రెస్ రాజ్యం వస్తే ఇందిరమ్మ రాజ్యం తెస్తామంటున్నారని.. ఇందిరమ్మ రాజ్యంలో ఎన్‌కౌంటర్లు, కాల్చి చంపుడు తప్ప ఏముందని కేసీఆర్ ప్రశ్నించారు. అటువంటి దుర్మార్గమైన ఇందిరమ్మ రాజ్యం ఉన్నప్పుడే నాగజ్యోతి తండ్రి ఉద్యమాల్లో పోయి అమరుడయ్యారని గుర్తుచేశారు. తండాలను పంచాయతీలుగా మార్చిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కతుందన్నారు. 100కోట్లతో సమ్మక్క - సారక్క జాతరను బ్రహ్మాండంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ సారి అధికారంలోకి వస్తే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసుకుందామన్న కేసీఆర్.. నాగజ్యోతిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.