ఇందిరమ్మ రాజ్యం బాగుంటే ఎన్టీఆర్ పార్టీ ఎందుకు పెట్టిర్రు : కేసీఆర్
X
ఇందిరమ్మ రాజ్యం బాగుంటే ఎన్టీఆర్ టీడీపీని ఎందుకు పెట్టారని కేసీఆర్ ప్రశ్నించారు. ఇందిరమ్మ రాజ్యంలో ప్రజలు ఆగమయ్యారు కాబట్టే.. ఎన్టీఆర్ 2 రూపాయలకు కిలో బియ్యం ఇచ్చారని చెప్పారు. నకిరేకల్లో జరిగిన బీఆర్ఎస్ ప్రజాశీర్వాద సభలో కేసీఆర్ ప్రశ్నించారు. ఉన్న తెలంగాణను ఊడగొట్టిందే కాంగ్రెస్ పార్టీ అని విమర్శించారు. 2004లో తెలంగాణ ఇస్తామని తమతో పొత్తు పెట్టుకుని.. అధికారంలోకి వచ్చాక మాట తప్పారని ఆరోపించారు. ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజలు ఆగమాగం కాకుండా ఆలోచించి ఓటెయ్యాలని సూచించారు. అభ్యర్థితో పాటు పార్టీ చరిత్రను తెలుసుకుని ఓటు వేయాలని సూచించారు.
ఈ పదేళ్లలో తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామని కేసీఆర్ తెలిపారు. రైతు సంక్షేమానికి పెద్దపీట వేశామన్నారు. రైతు బంధు, రైతు బీమా, సాగునీరు, ధాన్యం కొనుగోలుతో వారికి అండగా నిలిచామన్నారు. బ్రాహ్మణవెల్లంల ప్రాజెక్ట్ పూర్తైతే నకిరేకల్లోని లక్ష ఎకరాలకు సాగు నీరు అందుతుందని తెలిపారు. ఈ సారి అధికారంలోకి వస్తే పెన్షన్లను 5వేలకు పెంచుతామన్నారు. కాంగ్రెస్ గత 50ఏళ్లలో చేసిందేమిలేదని.. బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి మీ కళ్ల ముందే కన్పిస్తుందని తెలిపారు. మంచి ప్రభుత్వం ఉంది కాబట్టే మంచి పనులు జరిగాయని చెప్పారు.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అభివృద్ధి ఆగమవుతుందని కేసీఆర్ అన్నారు. రైతు బంధు దుబారా అని ఉత్తమ్.. మూడు గంటల కరెంట్ చాలని రేవంత్ అనడం సిగ్గుచేటన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణిని తీసేస్తామంటున్నారని.. ధరణి తీసేస్తే పైరవీకారుల రాజ్యం వస్తదన్నారు. ధరణి ఉండడం వల్లే రైతు బంధు నిధులు సకాలంలో జమవుతున్నాయని చెప్పారు. ఈ అభివృద్ధి ఇలాగే కొనసాగాలంటే బీఆర్ఎస్ అభ్యర్థి చిరుమర్తి లింగయ్యను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.