తెలంగాణ చీకట్లోకి వెళ్తదన్న నాయకులే చీకట్లో కలిశారు : కేసీఆర్
X
తన లాంటి నాయకుడిని పోగొట్టుకోవద్దని సీఎం కేసీఆర్ అన్నారు. ప్రజల కోసం ఆలోచించే తన లాంటి నాయకుడు మళ్లీ రాడని చెప్పారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో బీఆర్ఎస్ ఆశీర్వాద సభలో సీఎం ప్రసంగించారు. 50ఏళ్లు పాలించిన కాంగ్రెస్ రాష్ట్రానికి చేసిందేమి లేదని విమర్శించారు. మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దళారుల రాజ్యం వస్తుందని.. రైతు బంధు రాం రాం.. దళిత బంధుకు జైభీం పాడతారని అన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఇస్తే తెలంగాణ చీకట్లోకి వెళ్తదన్న నాయకులే చీకట్లో కలిశారని.. దేశంలోనే 24గంటల కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు.
ధరణితో తెలంగాణ రైతులు నిశ్చింతగా ఉన్నారని.. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణిని తీసేస్తామంటున్నారని కేసీఆర్ ఆరోపించారు. ఒకవేళ ధరణి తీసేస్తే పైరవీకారుల చుట్టు తిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు. కాబట్టి ప్రజలు ఓటేసేటప్పుడు ఆలోచించి వేయాలని.. అభివృద్ధి చేసే పార్టీకి అండగా నిలవాలని సూచించారు. అన్ని పార్టీ దళితులను ఓటు బ్యాంకుగా వాడుకున్నాయి..దళితులపై ఎందుకంత వివక్ష అని ప్రశ్నించారు. కేసీఆర్ రాకముందు దళితబంధు ఉన్నదా అని ప్రశ్నించారు. దళితుల శ్రేయస్సు కోసం ఆలోచించిన పార్టీ బీఆర్ఎస్ మాత్రమే అని చెప్పారు.
ఖమ్మం జిల్లాలో నిర్మిస్తున్న సీతారామ ప్రాజెక్టు తన గుండెకాయ లాంటిందని కేసీఆర్ చెప్పారు. ప్రాజెక్టు పనులు 70శాతం పూర్తైనట్లు చెప్పారు. సీతారామ ప్రాజెక్టుతో ఉమ్మడి ఖమ్మం జిల్లా బంగారు తునక అవుతుందన్నారు. ప్రాజెక్టు పూర్తైన తర్వాత ఖమ్మం జిల్లాకు కరువు ఉండదని స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లాలోని కొంత మంది కాంగ్రెస్ నాయకులు అహంకారంతో విర్రవీగుతున్నారని.. వారి డబ్బు రాజకీయాలకు ప్రజలే తగిన గుణపాఠం చెప్పాలని సూచించారు. అభివృద్ధి కొనసాగాలంటే సండ్ర వెంకటవీరయ్యను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.