కాంగ్రెస్ తెచ్చే భూమాత.. భూమేతే అవుతుంది : కేసీఆర్
X
ధరణి స్థానంలో కాంగ్రెస్ తెచ్చే భూమాత.. భూమేతే అవుతుందని సీఎం కేసీఆర్ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో మళ్లీ కారుచీకట్లు కమ్ముకుంటాయన్నారు. తాండూరు బీఆర్ఎస్ ఆశీర్వాద సభలో కేసీఆర్ ప్రసంగించారు. తాండూరు బీఆర్ఎస్ అభ్యర్థి పైలట్ రోహిత్ రెడ్డి నిజాయితీపరుడని.. నియోజకవర్గ అభివృద్ధికై అహర్నిశలు కృషి చేశారని చెప్పారు. బీజేపీ వాళ్లు ప్రభుత్వాన్ని కూలగొట్టాలని కుట్ర చేస్తే వాళ్లను జైల్లో వేయించారని చెప్పారు. ఆయన అడిగింది ఏది కాదనకుండా మంజూరు చేస్తామన్నారు.
కర్ణాటక ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఐదు గంటల కరెంటే ఇస్తున్నారని.. తెలంగాణలో కూడా కాంగ్రెస్‌కు ఓటేస్తే మన గతి కూడా అంతే అయితది సీఎం కేసీఆర్ హెచ్చరించారు. రైతు బంధు, రైతు బీమా, సాగునీరు, ధాన్యం కొనుగోలు కేంద్రాలతో రైతులకు అండగా నిలిచామన్నారు. రైతు బంధును పుట్టిచ్చిందే కేసీఆర్ అని అన్నారు. మూడు గంటల కరెంట్ చాలని రేవంత్.. రైతు బంధు దుబారా అని ఉత్తమ్ అనడం సిగ్గుచేటని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణి తీసేస్తామంటున్నారని.. ధరణి తీసేస్తే మళ్లీ దళారుల రాజ్యం వస్తుందన్నారు. ధరణి ఉండడం వల్లే రైతు బంధు సొమ్ము సకాలంలో అకౌంట్లలో జమవుతున్నాయని చెప్పారు.
తండాలను గ్రామపంచాయతీలుగా మార్చిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందని కేసీఆర్ అన్నారు. తాండూరు 24 తండాలను పంచాయతీలుగా మార్చామని చెప్పారు. బంజారాహిల్స్‌లో బంజారాలు లేకుండా పోయారన్నారు. బంజారాల గౌరవానికి చిహ్నంగా బంజారా భవన్ కట్టుకున్నట్లు తెలిపారు. ఈ అధికారంలోకి వచ్చాక పెన్షన్ ను 5వేలకు పెంచుతామని హామీ ఇచ్చారు. ఒకరికి ఇచ్చియుద్ధం ఇంకొకరిని చేయమనడం ధర్మం కాదని.. ప్రజల పక్షాన ఉండే వారి చేతిలో కత్తి పెడితేనే అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. వచ్చే ఎన్నికల్ల్లో రోహిత్ రెడ్డిని గెలిపిస్తేనే.. నియోజకవర్గం మరింత అభిదృద్ధి చెందుతుందని తెలిపారు.