CM KCR: కిషోర్ను గెలిపిస్తే తుంగతుర్తికి దళిత బంధు ఇస్తాం - సీఎం కేసీఆర్
X
తెలంగాణ ఇచ్చినమని చెప్పేందుకు కాంగ్రెస్ నాయకులకు సిగ్గుండాలని సీఎం కేసీఆర్ అన్నారు. భయంకరమైన ఉద్యమంతో రాష్ట్రం వచ్చిందే తప్ప కాంగ్రెస్ ఉత్తగనే ఇయ్యలేదని చెప్పారు. చావు నోట్లో తలపెట్టి తెలంగాణ సాధించానని స్పష్టం చేశారు. తుంగతుర్తిలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన ఈ కామెంట్లు చేశారు. తుంగతుర్తి పోరాటాల గడ్డ అన్న సీఎం కేసీఆర్... గత పాలకుల కారణంగానే ఆ ప్రాంతం కరువు బారిన పడిందని అన్నారు. స్వరాష్ట్రం ఏర్పడి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక గోదావరి నీళ్లను పట్టుబట్టి తెచ్చుకుని లక్ష ఎకరాలకు ఇస్తున్నామని చెప్పారు. త్వరలోనే దేవాదుల నీళ్లు సైతం తుంగతుర్తికి వస్తాయని కేసీఆర్ స్పష్టం చేశారు. బస్వాపూర్ ప్రాజెక్టు అనుసంధానం పూర్తైతే నియోజకవర్గంలోని 2లక్షల ఎకరాలకు నీళ్లు అందుతాయని అన్నారు. గతంలో తుంగతుర్తి నుంచి వలసలు చూసి కన్నీళ్లు వచ్చేవని, ఇప్పుడు పరిస్థితి చూస్తే ఎంతో సంతృప్తి కలుగుతోందని చెప్పారు.
పేదలు, రైతుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని కేసీఆర్ అన్నారు. వృత్తి పనుల వారికి సైతం భరోసా కల్పిస్తున్నామని చెప్పారు. దేశంలోనే తొలిసారి రైతు బంధు పథకాన్ని మన రాష్ట్రంలోనే అమలు చేస్తున్నామని కేసీఆర్ స్పష్టం చేశారు. నెహ్రూ హయాంలోనే దళిత బంధు తెచ్చి ఉంటే ప్రస్తుతం పరిస్థితి వేరేలా ఉండేదని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి అనుగుణంగా పెన్షన్లు ఇస్తామని స్పష్టం చేశారు. మళ్లీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆసరా పింఛను మొత్తాన్ని రూ.3వేలకు పెంచుతామని, ఆ తర్వాత ఏడాదికి రూ.500 చొప్పున పెంచుతూ రూ.5వేలు చేస్తామని హామీ ఇచ్చారు. దేశంలో తొలిసారిగా దామరచర్లలో అల్ట్రా పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయబోతున్నట్లు కేసీఆర్ ప్రకటించారు.
గాదరి కిషోర్ చొరవ కారణంగా తుంగతుర్తి ఎంతో అభివృద్ధి చెందిందని కేసీఆర్ చెప్పారు. ఉద్యమ సమయంలో ఆయన జైలుకు వెళ్లిన విషయాన్ని గుర్తు చేశారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తున్న ఆయనను లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఎమ్మెల్యేగా గాదరి కిషోర్ ను మళ్లీ గెలిపిస్తే తుంగతుర్తి అంతటా దళిత బంధు అమలు చేస్తామని కేసీఆర్ ప్రకటించారు.