ధరణి తీసేస్తే.. మళ్లీ లంచాల కాలం వస్తుంది - కేసీఆర్
X
దళితులు ఆర్థికంగా ఎదగాలనే ఉద్దేశంతో హుజురాబాద్ నియోజకవర్గంలో ఒకే విడుతలో దళితబంధు అమలు చేశామని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. ఇప్పుడు అక్కడి దళిత వాడలు.. దొరల వాడల్లా మారాయని అన్నారు. వికారాబాద్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న కేసీఆర్ మెతుకు ఆనంద్‌కు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. దళిత సమాజం తరతరాలుగా దోపిడికీ గురైందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ సరైన పథకాలు అమలు చేసి ఉంటే దళితులు ఇంకా పేదరికంలో ఎందుకు ఉండేవారని ప్రశ్నించారు.
కాంగ్రెస్ పార్టీ దళితుల్ని కేవలం ఓటు బ్యాంకుగా వాడుకుంటోందని కేసీఆర్ ఆరోపించారు. అమ్మను చూడు.. మాకు ఓటు గుద్దు అని అంటున్నారే తప్ప సంక్షేమానికి పాటు పడటంలేదని విమర్శించారు. దేశంలో ఎక్కడ.. ఏ సీఎం, ఏ పార్టీ, ఏ ప్రధాని ఆలోచించని పద్ధతుల్లో మేం ఆలోచించి దళితబంధు అమలు చేస్తున్నామని ఫలతంగా మంచి ఫలితాలు వస్తున్నాయని చెప్పారు. బీఆర్ఎస్కు అధికారం ఇస్తే అన్ని కుటుంబాలకు దళితబంధు ఇచ్చి వికారాబాద్ దరిద్రాన్ని తీసి అవతల పడేద్దామని కేసీఆర్ పిలుపునిచ్చారు.
గత పదేళ్లలో తెలంగాణలో ఏం మార్పు వచ్చిందో బేరీజు వేసుకోవాలని కేసీఆర్ సూచించారు. కంటి వెలుగు కార్యక్రమం కింద 3కోట్ల మందికి కంటి పరీక్షలు నిర్వహించామని చెప్పారు. రైతులకు 24 గంటల ఉచిత నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నామన్న కేసీఆర్.. ధరణి తీసేస్తామని కాంగ్రెస్ నాయకులు అంటున్నారని, అదే జరిగితే మళ్లీ లంచాల కాలం వస్తుందని హెచ్చరించారు. ధరణి ఉండాలంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను గెలిపించాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. ఎన్నికల్లో అభ్యర్థులతో పాటు వారి పార్టీ చరిత్ర కూడా చూడాలన్న ఆయన.. ప్రజల గురించి ఏ పార్టీ ఎలా ఆలోచిస్తుందో గమనించి ఓటు వేయాలని సూచించారు.