Home > తెలంగాణ > బీఆర్ఎస్ తెలంగాణ ప్రజల కోసమే పుట్టిన పార్టీ : కేసీఆర్

బీఆర్ఎస్ తెలంగాణ ప్రజల కోసమే పుట్టిన పార్టీ : కేసీఆర్

బీఆర్ఎస్ తెలంగాణ ప్రజల కోసమే పుట్టిన పార్టీ : కేసీఆర్
X

బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల కోసమే పుట్టిన పార్టీ అని సీఎం కేసీఆర్ అన్నారు. గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ రాష్ట్రాభివృద్ధిని గాలికొదిలేస్తే.. బీఆర్ఎస్ వచ్చాక పదేళ్లలో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామన్నారు. ఇల్లందులో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజాశీర్వాద సభలో కేసీఆర్ ప్రసంగించారు. ఇల్లందు ఉద్యమాల పురిటిగడ్డ అని అన్న సీఎం.. ఇక్కడి గిరిజనులకు పెద్దఎత్తున పోడు పట్టాలు ఇచ్చామని చెప్పారు. నియోజకవర్గంలో 48వేల ఎకరాలు పోడు భూములకు పట్టాలు ఇచ్చామని వివరించారు.

ధరణి పోర్టల్ వచ్చాక భూములు భద్రంగా ఉన్నాయని కేసీఆర్ చెప్పారు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణిని తీసేస్తామంటున్నారని.. అలా జరిగితే మళ్లీ పైరవీకారుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు. కేసీఆర్ రాకముందు దళిత బంధు అనే పదం వినబడిందా అని అడిగారు. దళితుల కోసం ఆలోచించింది బీఆర్ఎస్ పార్టీ మాత్రమే అని చెప్పారు. ఈ సారి అధికారంలోకి వస్తే 93లక్షల రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం ఇస్తామన్నారు. ప్రజలందరికీ ఇన్సూరెన్స్, 5వేల పెన్షన్..400కే గ్యాస్ సిలిండర్ అందజేస్తామని వివరించారు.

ఖమ్మం జిల్లాలో నిర్మిస్తున్న సీతారమ ప్రాజెక్టు పనులు 70శాతం పూర్తైనట్లు కేసీఆర్ చెప్పారు. సీతారామ ప్రాజెక్టుతో ఉమ్మడి ఖమ్మం జిల్లా బంగారు తునక అవుతుందన్నారు. ప్రాజెక్టు పూర్తైన తర్వాత ఖమ్మం జిల్లాకు కరువు ఉండదని.. ఇల్లందులోని అన్ని మండలాలకు సాగునీరు అందేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లాలోని కొంత మంది కాంగ్రెస్ నాయకులు అహంకారంతో విర్రవీగుతున్నారని.. వారి డబ్బు రాజకీయాలకు ప్రజలే తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. అభివృద్ధి కొనసాగాలంటే హరిప్రియ నాయక్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.


Updated : 1 Nov 2023 5:33 PM IST
Tags:    
Next Story
Share it
Top