ప్రజలు గర్వపడేలా ఎల్లారెడ్డి, కామారెడ్డి అభివృద్ధి : కేసీఆర్
X
బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక కామారెడ్డి, ఎల్లారెడ్డి రూపురేఖలు మారుస్తామని సీఎం కేసీఆర్ అన్నారు. ఈ రెండు నియోజకవర్గాల ప్రజలు గర్వపడేలా అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఎల్లారెడ్డిలో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజాశీర్వాద సభలో ఆయన ప్రసంగించారు. బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ ప్రజల కోసమని.. ప్రజల ప్రయోజనాలే తమకు ముఖ్యమన్నారు. 2014లో మొదటిసారి అధికారంలోకి వచ్చాక ప్రజా సంక్షేమానికి పెద్ద పీట వేశామని తెలిపారు. ఒక్కో సమస్యను పరిష్కరించుకుంటూ ముందుకు సాగుతున్నామన్నారు.
తలసరి ఆదాయంలో తెలంగాణ నంబర్ 1 స్థానంలో ఉందని కేసీఆర్ తెలిపారు. కాంగ్రెస్ పాలనలో సాగునీరు, మంచినీటికి కటకట ఉండేదని.. కానీ బీఆర్ఎస్ వచ్చాక ఆ సమస్యలకు చెక్ పెట్టామన్నారు. ఇంటింటికి తాగు నీరు, 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే అని చెప్పారు. కాంగ్రెస్ తీరుతో గత 58ఏళ్లు గోస పడ్డామని.. మరోసారి ఆ పార్టీని నమ్మి ప్రజలు మోసపోవద్దని సూచించారు. ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజలు ఆగమాగం కాకుండా అభివృద్ధి చేసే పార్టీకి ఓటెయ్యాలని కోరారు.
రైతుసంక్షేమానికి తమ ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని కేసీఆర్ అన్నారు. రైతు బంధు, రైతు బీమా, సాగునీరు, ధాన్యం కొనుగోలుతో వారికి అండగా నిలిచామన్నారు. రైతు బంధు దుబారా అని ఉత్తమ్.. మూడు గంటల కరెంట్ చాలని రేవంత్ అనడం సిగ్గుచేటని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణి తీసేస్తామంటున్నారని.. ధరణి తీసేస్తా మళ్లీ పైరవీకారుల రాజ్యం వస్తుందని కేసీఆర్ అన్నారు. ధరణి ఉండడం వల్లే భూసమస్యలు లేవని.. రైతు బంధు డబ్బులు సకాలంలో పడుతున్నాయని చెప్పారు. ఈ సారి అధికారంలోకి వచ్చాక అర్హులైన వారందరికీ దళిత బంధు ఇస్తామన్నారు. ఈ అభివృద్ధి ఇలాగే కొనసాగాలంటే బీఆర్ఎస్ అభ్యర్థి జాజుల సురేందర్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.