Home > తెలంగాణ > మహారాష్ట్రకు నేనెందుకు రావొద్దు.. అ పనిచేస్తే రాను : కేసీఆర్

మహారాష్ట్రకు నేనెందుకు రావొద్దు.. అ పనిచేస్తే రాను : కేసీఆర్

మహారాష్ట్రకు నేనెందుకు రావొద్దు.. అ పనిచేస్తే రాను : కేసీఆర్
X

మహారాష్ట్రకు తాను ఎందుకు రాకూడదని సీఎం కేసీఆర్ అక్కడి నేతలను ప్రశ్నించారు. మహారాష్ట్రలో తెలంగాణ అజెండా అమలు చేస్తే తాను వెనక్కి వెళ్లిపోతానని స్పష్టం చేశారు. ‘‘మహారాష్ట్రలో కేసీఆర్‌కు ఏం పని అని ఫడ్నవీస్‌ విమర్శిస్తున్నారు. నేను ఈ దేశంలోనే పుట్టాను. ఎక్కడికైనా వెళ్లి పని చేయగలను. తెలంగాణలో రైతులకు ఉచిత విద్యుత్‌ ఇస్తున్నాం. ఏర్పడిన అతి తక్కువ సమయంలో తెలంగాణ అభివృద్ధి సాధించింది. తెలంగాణలో అభివృద్ధి సాధ్యమైనప్పుడు మహారాష్ట్రలో ఎందుకు కాదు’’ అని కేసీఆర్ ప్రశ్నించారు.




బీఆర్ఎస్ అంటే భారత్ పరివర్తన్ పార్టీ అని సీఎం కేసీఆర్ అన్నారు. ఎవరెన్ని విమర్శలు చేసినా భారత రాష్ట్ర సమితి దేశవ్యాప్త విస్తరణ ఆగదని స్పష్టం చేశారు. మహారాష్ట్ర సోలాపూర్‌ జిల్లాలోని సర్కోలీలో జరిగిన బీఆర్‌ఎస్‌ పార్టీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. తాము ఏ పార్టీకి ఏ టీం, బీ టీం కాదని అన్నారు. తమది రైతులు,దళితులు, అణగారిన వర్గాల టీమ్‌ అని కేసీఆర్‌ అన్నారు.

రైతులు తమ వెంట ఉంటే తాము ఎవరికో టీమ్‌ అవ్వాల్సిన అవసరమేంటని కేసీఆర్‌ ప్రశ్నించారు. దేశం మారితేనే సమస్యలకు పరిష్కారం లభిస్తుందని అన్నారు. దేశంలో మార్పు కోసం బీఆర్ఎస్ పనిచేస్తుందని స్పష్టంచేశారు. కేంద్రానికి దమ్ముంటే దేశంలో ప్రతీ ఎకరాకు నీళ్లు ఇవ్వాలన్న కేసీఆర్.. ప్రస్తుత దేశ జలవిధానాన్ని బంగాళాఖాతంలో కలిపాలని అన్నారు. దేశంలో 60 శాతం మంది వ్యవసాయం మీదే ఆధారపడి బతుకుతున్నారని, అలాంటిది.. రైతుల కోసం ఎందుకు చర్చించరని కేంద్రాన్ని నిలదీశారు.

దేశంలోని చిన్న గ్రామాల నుంచి పెద్ద నగరాల వరకు విద్యుత్‌ అందించే సామర్థ్యం మనకు ఉందని కేసీఆర్‌ చెప్పారు. కేంద్ర ప్రభుత్వాల చేతగాని తనమే దేశంలో విద్యుత్‌ సమస్యలకు కారణమని మండిపడ్డారు. ‘‘ఇకనైనా భారతదేశం సరికొత్త పంథాలో నడవాల్సిన అవసరం ఉంది. మనకంటే చిన్న దేశాలు ఎంతో అభివృద్ధి సాధించాయి. పొరుగు దేశం చైనా ఎక్కడుంది.. మనమెక్కడ ఉన్నాం. తెలంగాణలో తాము ఎన్నో అభివృద్ధి పథకాలను అమలు చేస్తున్నాం. రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలను తీసుకొచ్చాం’’ అని తెలిపారు.

Updated : 27 Jun 2023 3:04 PM IST
Tags:    
Next Story
Share it
Top